కరోనా రోగిని తరలించే అంబులెన్స్ ధర కిలో మీటర్‌కు ఇంతా?
కరోనా పేషెంట్‌ను తరలించినందుకు భారీగా సోమ్ము దండుకున్న ఓ అంబులెన్స్ నిర్వహకుడిపై పూణె పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడికి కరోనా సోకిందని తెలిసి కేవలం 7 కి.మీ.ల దూరంలో ఉన్న ఆస్పత్రికి అతడిని తరలించేందుకు సదరు నిర్వహకుడు ఏకంగా రూ. 8000 పుచ్చుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం బిబ్వేవాడీ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో బాధితుడికి కరోనా నిర్ధారణ టెస్టు జరపగా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు ఎరండ్వానే ప్రాంతంలో ఉన్న దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరేందుకు సిద్ధమైయ్యాడు. అతడికి పరీక్ష నిర్వహించిన ప్రదేశానికి ఇది 7 కిమీల దూరంలో ఉంది.
దీంతో అక్కడికి వెళ్లేందుకు అతడు అంబులెన్స్ సేవలను వినియోగించుకున్నాడు. ఫలితంగా అతడు ఏకంగా 8 వేల రూపాలయలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో బాధితుడి నుంచి డబ్బు వసూలు చేసిన అంబులెన్స్ నిర్వహకుడిపై జిల్లా అధికారులు విపత్తు నిర్వహణ చట్టం, మోటార్ వాహనాల చట్టం కింద కేసు నమోదు చేశారు.