HSIL: తెలంగాణలో హెచ్ఎస్ఐఎల్ రూ.220 కోట్ల పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్రంలో రూ.320 కోట్ల పెట్టుబడులకు గ్లాస్, ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం హిందుస్థాన్ శానిటరీవేర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (హెచ్ఎస్ఐఎల్) ముందుకొచ్చింది. దేశంలోనే అతిపెద్ద గ్లాస్ ప్యాకేజింగ్ ఉత్పత్తిదారుగా ఉన్న హెచ్ఎస్ఐఎల్.. హిండ్‌వేర్ బ్రాండ్‌తో ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగ్ సొల్యూషన్స్‌ను మార్కెటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో తమ వ్యాపార, ఉత్పాదక సామర్థ్య విస్తరణ దిశగా మరిన్ని పెట్టుబడులను బుధవారం ప్రకటించింది.
ఇందులో భాగంగానే స్పెషాలిటీ గ్లాస్ తయారీకి తమ ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌లో రూ.220 కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లు తెలియజేసింది. భువనగిరి వద్ద నూతన గ్రీన్‌ఫీల్డ్ స్పెషాలిటీ గ్లాస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. 2022 సెప్టెంబర్ ఆఖరుకల్లా ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తుందని సంస్థ ఈ సందర్భంగా తెలియజేసింది.
రోజుకు 150 టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న యూనిట్ 2022, సెప్టెంబరు చివరి నాటికి ఉత్పత్తి ప్రారంభించగలదని హెచ్ఎస్ ఐఎల్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ సొమానీ చెప్పారు. 15 ఏకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్లో అయిదు తయారీ సదుపాయాలు ఉంటాయి. ఇప్పటికే ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌నకు సనత్‌నగర్, భువనగిరిలో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ రెండు యూనిట్లలో రోజుకు 1600 టన్నుల కంటైనర్ గ్లాస్‌ను కంపెనీ తయారు చేయగలదు.
సంగారెడ్డి ప్లాంట్ విస్తరణ : హింద్‌వేర్ బ్రాండ్‌తో ఉత్పత్తులను విక్రయిస్తున్న హెచ్ఎస్ఐఎల్ రూ.100 కోట్లతో ప్లాస్టిక్ పైపులు, ఫిటింగ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనుంది. సంగారెడ్డి ప్లాంట్ సామర్థ్యాన్ని 30 వేల టన్నుల నుంచి 48 వేల టన్నులకు పెంచుతున్నామని, 2022 సెప్టెంబరు చివరికి సామర్థ్య పెంపు పూర్తవుతుందని సందీప్ సొమానీ తెలిపారు.