ఏపీలో భారీ బస్సు తయారీ ప్లాంట్ ప్రారంభించిన నారా లోకేష్
ఏపీలో మరో ఆటోమొబైల్ పరిశ్రమ అందుబాటులోకి వచ్చింది. విజయవాడకు సమీపంలోని మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో సుమారుగా 75 ఎకరాల విస్తీర్ణంలో అశోక్ లేలాండ్ ప్లాంటును నిర్మించారు. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ మంత్రి శ్రీ నారా లోకేశ్ గారు అశోక్ లేలాండ్ ప్లాంటును ప్రారంభించారు. ఈ ప్లాంటు నుండి ఏడాదికి సుమారు 4800 బస్సులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హిందూజ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ప్రముఖ వాణిజ్య వాహనాలను ఉత్పత్తి చేస్తున్న అశోక్ లేలాండ్ గ్రూపు మల్లవల్లిలో తమ కొత్త బస్సుల తయారీ ప్లాంటును ప్రారంభించింది. ఈ సందర్భంగా అశోక్ లేలాండ్ మరియు హిందూజా స్విచ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల తాళాలను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. ఈ ప్లాంటు ద్వారా అశోక్ లేలాండ్ డీజల్ బస్సులు మరియు స్విచ్ మొబిలిటీ ఎలక్ట్రిక్ బస్సులను ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంటు ద్వారా మొత్తం 1800 ఉద్యోగాలు లభించనున్నాయి. తొలి విడతలో 600 మందికి ఆ తర్వాత విడతలో మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు అశోక్ లేలాండ్ ప్రతినిధులు పేర్కొన్నారు.