ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం
గబ్బా మైదానంలో టీమిండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో (India vs Australia 4th Test 2021) టీమిండియా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య జట్టు నిర్థేశించిన 328 పరుగుల విజయ లక్ష్యాన్ని అనూహ్య రీతిలో భారత్ ఛేదించింది. రిషభ్ పంత్ దూసుడైన ఆటకు.. పుజారా డిఫెన్స్ తోడవడంతో ఆసీస్ గడ్డపై విజయాన్ని సాధించింది.32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి ఎరుగని కంగారూ జట్టుకు టీమిండియా ఓటమి రుచి చూపించింది.
నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, బుమ్రా, అశ్విన్ లాంటి కీలక ఆటగాళ్ల లేకుండానే పటిష్టమైన ఆసీస్ టీంపై విజయాన్ని (India vs Australia 4th Test 2021 Highlights) సాధించి ఔరా అనిపించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(89 నాటౌట్) ఆసీస్ బౌలర్లను ఊచకోత కోయగా..శుభ్‌మన్ గిల్(91) అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తరువాత చటేశ్వర్ పుజారా(56) అమోఘమైన డిఫెన్స్‌తో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. ఒకానొక సమయంలో పుజారాను అవుట్ చేయలేని కంగారూ బౌలర్లు అతడి శరీరానికి సైతం బంతులు వేసి బాధించారు.
అయినప్పటికీ పుజారా డిఫెన్స్‌ను ఛేదించడంలో విఫలమయ్యారు. ఇక మ్యాచ్ చివరి వరకు పంత్ క్రీజులో పాతుకుపోయి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా గాబా పిచ్‌లో ఆసీస్ ఓటమంటే ఎరుగదు. దశాబ్దాలుగా ఆ పిచ్‌లో ఆసీస్‌ను ఓడించిన దేశం లేదు. ఈ విషయాన్నే మ్యాచ్ ముందు ఆసీస్‌కు చెందిన అనేకమంది మాజీలు కూడా వ్యాఖ్యానించారు. అయితే వారందరి ఆలోచనలనూ తలక్రిందులూ చేస్తూ భారత్ విజయఢంకా మోగించింది.
నాలుగు పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు రోహిత్ శర్మ ఔట్ ద్వారా ఎదురుదెబ్బ తగిలింది. ఆ తరవాత క్రిజ్‌లోకి వచ్చిన పుజారా, మరో ఓపెనర్ శుభమన్ గిల్‌తో ఇన్సింగ్స్‌కు బలమైన పునాదులు వేశారు. గిల్ 91 పరుగుల వద్ద ఔట్ అవ్వగా.. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. పుజారా సైతం 56 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కెప్టెన్ రహానే 24 పరుగులతో వెంటనే పెవిలియన్ బాట పట్టినా.. యువ సంచలనం రిషభ్ పంత్ సూపర్భ్ ఇన్నింగ్స్‌తో భారత్‌ను విజయ తీరాలకు చేర్చాడు. పంత్ 134 బంతుల్లో 89 పరుగులు చేసిన కీలక సమయంలో వెనుదిరిగాడు. చివరిలో వాషింగ్టన్ సుందర్ 25 మెరుపు ఇన్సింగ్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా కీలకమైన చివరి మ్యాచ్‌లో హైదరాబాదీ పేసర్ సిరాజ్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే.