టీడీపీని మూసేసే వరకూ ఊరుకునేట్లుగా లేరుగా..!

Saturday, June 22, 2019 12:19 PM Politics
టీడీపీని మూసేసే వరకూ ఊరుకునేట్లుగా లేరుగా..!

టీడీపీకి షాకిస్తూ నలుగురు రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వారు బీజేపీ కండువా కప్పుకొన్నారు, అనంతరం టీడీపీ పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనం అయిన సంగతి తెలిసిందే. పార్టీ మారిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోదించారు. అయితే ఇప్పుడు వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కొద్దికాలం క్రితం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ప్రజాప్రతినిధుల సభ్యత్వం వెంటనే పోయేలా చట్టాలుండాలని వ్యాఖ్యానించారు. 

ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 23 మంది వైసీపీ నాయకులని టీడీపీ లోకి తీసుకున్నపుడు స్పందించని వెంకయ్యనాయుడు, ఎన్నికలు పూర్తయి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఈ కామెంట్లు చేశారు. వెంకయ్య కామెంట్లను అంతా స్వాగతించారు కానీ అదే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఇప్పుడు పార్టీ మారిన ఎంపీలను బీజేపీలో విలీనం చేసేస్తూ ఎంచక్కా వారి పదవులను సైతం కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం పైన పలువురు ప్రశ్నిస్తున్నారు.