జగన్‌పై టీడీపీ ప్రశంసలుః క్రెడిట్ అంతా కరోనాదే!
టీడీపీతో నిజాలు చెప్పించడం ఒక్క కరోనాకే సాధ్యమైంది. కరోనాను రాజకీయంగా వాడుకోవాలనే టీడీపీ భావించినప్పటికీ నిజాలు చెప్పకుండా ఉండలేని స్థితి. సీఎం జగన్‌పై పరోక్షంగానైనా టీడీపీ ప్రశంసలు కురిపించాల్సి వచ్చింది. జగన్ పాలనలో గతంలో కంటే భారీగా ఆదాయం పెరిగిందని తనకు తానుగా రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల వేతనాలను వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు జగన్ సర్కార్ నిర్ణయించింది. అంతేకాదు తమ రాష్ట్రానికి నిధులిచ్చి ఆదుకోవాలని ప్రధాని మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్ విన్నవించాడు.
అయితే కరోనాపై తామేమీ రాజకీయాలు చేయమని ఒక వైపు చంద్రబాబు ఆదర్శాలు చెబుతూనే, మరోవైపు తన పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రతో సీఎంకు బహిరంగ లేఖ రాయించాడు. ఏపీ సర్కార్‌ను విమర్శిస్తూ లేఖ రాస్తే తాను విమర్శలపాలవుతాననే భయంతో చంద్రబాబు ఇతరులతో ఆ పని చేయించాడు. సరే లేఖ ఎవరు రాసినా అది ప్రతిపక్ష టీడీపీ అభిప్రాయం. లేఖలోని అంశాలను పరిశీలిస్తే ఇంత కాలం జగన్ సర్కార్‌పై చేస్తున్న ఆరోపణలకు భిన్నంగా అందులోని అంశాలున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్రం పదేళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, ఎన్ని ఇబ్బందులున్నా తానొక విజనరీతో పాలన సాగించానని, ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నించానని చంద్రబాబు ఎన్నోసార్లు ఈ పది నెలల కాలంలో విమర్శించాడు. మరి జగన్‌కు ధూళిపాళ్ల నరేంద్ర రాసిన బహిరంగ లేఖలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏం కూశారో తెలుసుకుందాం.
‘‘గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేతికి రూ.30 వేల కోట్లు అదనంగా వచ్చాయి. రెండు రోజుల క్రితం ముగిసిన ఆర్థిక సంవత్సరం (2019-2020)లో ప్రభుత్వం చేతికి వచ్చిన నిధులు రూ.1.87 లక్షల కోట్లు. రాష్ట్ర ఆదాయం, కేంద్రం నుంచి వచ్చిన ఆదాయం, రుణాల నుంచి సేకరించిన నిధులు ఇందులోకి వస్తాయి. 2018-19లో ఇవే పద్దుల కింద రూ.1.57 లక్షల కోట్లు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా రూ.30 వేల కోట్ల నిధుల లభ్యత పెరిగింది’’ ....అని సాక్ష్యాత్తు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తన పాలనలో కంటే జగన్ పాలనలో రూ.30 వేల కోట్లు నిధుల లభ్యత పెరిగిందని రాష్ట్ర ప్రజలకు వెల్లడించింది.
ఆ లేఖలో ప్రస్తావించినట్టు....ఈ స్థాయిలో నిధుల లభ్యత ఉన్నప్పుడు ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఆపడం వింతగా ఉందని కాసేపు అనుకుందాం. వారం పాటు ఆదాయం రాలేదని జీతాల్లో కోత పెట్టడం చేతగానితనమనే నమ్ముదాం. మరి జగన్ చేతగానితనమైతే ఈ 30 వేల కోట్లు అదనంగా ఎలా వచ్చాయో టీడీపీ సమాధానం చెప్పాలి. జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి పోతోందని ఇన్నాళ్లు చేసిన విమర్శలకు, ప్రస్తుతం లేఖలో పేర్కొన్న గణాంకాలకు ఎందుకు తేడా వచ్చిందో టీడీపీ సమాధానం చెప్పడమే కాదు, అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
లేని ఆర్థిక సంక్షోభాన్ని ఉన్నట్టుగా ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తనకు తెలియకుండానే జగన్ సర్కార్‌పై ఇంత కాలం వేసిన అసమర్థ ముద్రను చెరిపివేశాడు. ఇంత కాలం జగన్ సర్కార్ పాలనా రీతుల వల్ల ఏపీ అంధకారంలోకి వెళ్లిపోతోందని చేసిన అల్లరి అంతా రాజకీయాల కోసమే అని చెప్పకనే చెప్పినట్టైంది. జగన్ పాలనపై టీడీపీతోనే నిజాలను కరోనా వైరస్ చెప్పించింది.
2018-19 ఆర్థిక సంవత్సరం కంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రూ.30 వేల కోట్లు నిధుల లభ్యత పెరిగిందని తనకు తానే టీడీపీ ఒప్పుకోవడం ద్వారా....చంద్రబాబు పాలనలో కంటే జగన్ పాలనలోనే రాష్ట్రానికి నిధులు ఎక్కువగా వస్తున్నాయని నేరుగా అంగీకరించాల్సి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగుల దృష్టిలో జగన్‌ను దోషిగా నిలబెట్టాలని టీడీపీ బహిరంగ లేఖ రాసినప్పటికీ...నిజాలు చెప్పక తప్పని సరి పరిస్థితి వచ్చింది. జగన్‌కు ముందు చూపు ఏమిటో టీడీపీ చెబుతున్న నిధుల లభ్యతను పెంచుకోవడంలోనే అర్థమవుతోంది. అందువల్ల 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న బాబుకు చేతగానిది...పది నెలల పాలనలోనే ప్రతిపక్షం నుంచి ప్రశంసలు అందుకున్న జగన్‌కు...టీడీపీ ఉచిత సలహాలు అవసరం లేదని తెలుసుకుంటే మంచిది.