వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు. అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.

Tuesday, January 21, 2020 12:33 PM Politics
వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు. అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత.

ఏపీలో రాజధాని రగడ తారా స్థాయికి చేరింది. సీఎం జగన్ తాను అనుకున్నట్టు మూడు రాజధానుల ప్రకటన చెయ్యటమే కాదు అసెంబ్లీలో బిల్లు ఆమోదం కూడా పొందేలా చేశారు. దీంతో రాజధాని గ్రామాల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన జగన్ ప్రభుత్వ కార్యాకలాపాలు అన్నీ విశాఖ వేదికగానే జరుగుతాయని పేర్కొన్నారు. ఇక నిన్నటి నుండి తీవ్ర స్థాయిలో రాజధాని గ్రామాల ప్రజల ప్రతిఘటన కొనసాగుతుంది.

ఇక ఇదే సమయంలో అమరావతి పరిధిలోని దొండపాడు గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సీఎం జగన్ మూడు రాజధానుల నిర్ణయం ప్రకటించిన నేపధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈఘటనతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న రాత్రి కొందరు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఈ ఉదయం వెలుగులోకి వచ్చింది.

దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు వెంటనే అక్కడికి చేరుకుని నిరసనలకు దిగారు. ఇదంతా టీడీపీ నేతల కుట్ర అని వారు ఆరోపిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న తుళ్లూరు పోలీసులు, దొండపాడుకు అదనపు బలగాలను తరలించారు. పరిస్థితులు అదుపు తప్పకుండా , ఎలాంటి అవాంచనీయ ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు.
 
ఇక మరోవైపు రాజధాని గ్రామాల్లో ఆందోళనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 29 గ్రామాల నుంచి ఎవరినీ బయటకు రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు . 144 సెక్షన్‌తోపాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉందంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రాజధాని గ్రామాల ప్రజలు పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్‌ను మించిన టెన్షన్ వాతావరణం ఎందుకు సృష్టిస్తున్నారంటూ రైతులు ఈ పరిస్థితిపై మండిపడుతున్నారు .
 

For All Tech Queries Please Click Here..!
Topics: