మందు బాబులకు పండగ లాంటి వార్త

Thursday, April 30, 2020 11:59 AM Politics
మందు బాబులకు పండగ లాంటి వార్త

లాక్‌డౌన్‌లో కల్లు ప్రియులకు ఇది నిజంగానే శుభవార్త. ఏపీలో కల్లుగీతకు ప్రభుత్వం అనుమతించబోతోంది. లాక్‌డౌన్‌కు వరుసగా మినహాయింపులు ప్రకటిస్తున్న జగన్ ప్రభుత్వం తాజాగా కల్లు ప్రియులకు శుభవార్త వినిపించబోతోంది. రాష్ట్రంలో కల్లు గీసేందుకు అనుమతి ఇచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే కల్లు గీత కార్మికులు సామాజిక దూరం నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేయబోతున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం పూర్తిగా నిలిచిపోయింది. అయితే కొందరు అక్రమార్కులు మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తూ లాక్‌డౌన్‌కు తూట్లు పొడుస్తున్నారు. అదే సమయంలో మద్యం దుకాణాల్లో చోరీలు కూడా పెరిగిపోయాయి. ఇంకోవైపు నాటుసారా కాసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నాటు సారా కాసి, మద్యం ప్రియులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం పెరిగిపోయిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిలో ఏకంగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా చేరడం విశేషం. ఈ నేపథ్యంలో నాటుసారా అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పలువురు జగన్ ప్రభుత్వానికి సూచించారు. అయితే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు.. కల్లు గీసేందుకు అనుమతులు జారీ చేయాలని తలపెట్టింది. వేలాది సంఖ్యలో కల్లు గీత కార్మికులు ఉపాధి దూరమైన తరుణంలో ఇది వారికి శుభవార్తగానే భావించాలి. అయితే కరోనా వైరస్ ప్రమాదం ఇంకా పూర్తిస్థాయిలో పోయినందువల్ల కల్లుగీతకు అనుమతి ఇస్తూనే.. కార్మికులు తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలి అని షరతు విధించబోతున్నారు. ఈ మేరకు విధివిధానాలను రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ ఫైనల్ చేస్తున్నట్టు సమాచారం. నేడో, రేపో ఈ ఉత్తర్వులు జారీ అవుతాయని తెలుస్తోంది.

For All Tech Queries Please Click Here..!
Topics: