లాక్‌డౌన్ ఉల్లంఘించి ఎమ్మెల్యే బర్త్ డే వేడుకలు..!
కరోనా వైరస్ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. పోలీసులు డాక్టర్లు శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. కానీ లాక్‌డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులే ఉల్లంఘిచటం ఇప్పుడు చర్చనాంశంగా మారింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే తప్పటడుగు వేస్తున్నారు.
వివరాలలోకి వెళితే కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తుముకూరు జిల్లాలోని టురువేకెరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం జయరాం లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. గుబ్బి పట్టణంలో తన బర్త్‌డే వేడుకలను నిర్వహించి విందు ఏర్పాటు చేశారు. చేతులకు గ్లౌసులు ధరించి కేక్ కట్ చేసి పిల్లలకు తినిపించారు. ఆ వేడుకలో కనీసం సామాజిక దూరం పాటించలేదు. ఎమ్మెల్యే బర్త్‌డే వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్న విషయం విదితమే. వివాహాలు, ఫంక్షన్లు, ఇతర వేడుకలకు దూరంగా ఉండాలని కర్ణాటక సీఎం యెడియూరప్ప పిలుపునిచ్చారు. కానీ కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం వినిపించుకోకుండా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.