కరోనాపై యుద్దం, ఇదీ జగన్ యాక్షన్ ప్లాన్.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతోన్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుని రాష్ట్రంలో హెల్త్ కేర్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. అనుకున్నదే తడవుగా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో క్వారెంటైన్ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 100-150 పడకలతో క్వారెంటైన్ సెంటర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కడ క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారో చెబుతూ కలెక్టర్లు ఆరోగ్యశాఖకు నివేదికను కూడా అందజేశారు.
నియోజకవర్గంలోని స్కూళ్లు,కాలేజీలు,ప్రభుత్వ భవనాలు,పెద్ద ఆసుపత్రులు.. ఇలా ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ క్వారెంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల క్వారెంటైన్ కేంద్రాలు వద్దంటూ గ్రామస్తులు అడ్డుపడినప్పటికీ.. వారికి నచ్చజెప్పి ఒప్పించారు. కరోనా నియంత్రణలో క్వారెంటైన్ కేంద్రాలది కీలక పాత్ర కావడంతో.. ఇక్కడ సేవలందించేందుకు సిబ్బంది కొరత లేకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులు,ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలను ఇందులో నియమించనున్నారు. అలాగే ఒక్కో క్వారంటైన్ కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్‌ను ఇన్‌చార్జిగా నియమించనున్నారు.10 నియోజకవర్గాల్లో వెంటిలేటర్లతో కూడిన క్వారెంటైన్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందు జాగ్రత్తలో భాగంగా మరికొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వెంటిలేటర్‌తో కూడిన పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.