చిక్కులో జగన్ సర్కార్, ఈ లాజిక్ ప్రకారం నిమ్మగడ్డ తొలగింపు చెల్లదు.
ఏపీలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ను తొలగింపు కోసం జగన్ సర్కార్ పదవీకాలం, సర్వీస్ రూల్స్ లో మార్పులు చేస్తూ ఓ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ఆధారంగా నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది. ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఓ అంశం కలిసి రానుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ఆధారంగా ఆయన తనపై వేటు చెల్లదని వెంటనే తనకు ఆ పదవి ఇవ్వాలని చెప్పుకునే అవకాశముందని చెప్తున్నారు.
జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో ప్రధానంగా రెండు అంశాలున్నాయి. వీటిలో ఒకటి కమిషనర్ పదవీకాలం తగ్గింపు, రెండు సర్వీస్ రూల్స్ సవరణ ద్వారా అర్హతలను మార్చడం. ఇందులో పదవీకాలం తగ్గింపు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా దానితో పాటే చేసిన సర్వీస్ రూల్స్ సవరణ మాత్రం పలు ప్రశ్నలను లేవనెత్తేలా ఉంది. కొత్తగా కమిషనర్ పదవిలోకి వచ్చే వారు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అయి ఉండాలన్న నిబంధన పైకి చూసేందుకు బాగానే ఉన్నా.. అది ప్రస్తుత కమిషనర్ తొలగింపు కోసం వాడుకున్నట్లు అవుతోంది. అదే ఇప్పుడు ఆర్డినెన్స్ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించేలా ఉంది. ఇదే అంశంపైనా నిమ్మగడ్డ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇక హైకోర్టు ఏమి తెలుస్తుందో వేచి చూడాలి.