బీజేపీ సీఎంల కంటే జగనే బెటర్..మాజీ కరసేవకుడే సాక్ష్యం

Tuesday, September 3, 2019 07:47 AM Politics
బీజేపీ సీఎంల కంటే జగనే బెటర్..మాజీ కరసేవకుడే సాక్ష్యం

అదేంటీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన ముఖ్యమంత్రుల కంటే ఏపీకి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెటరా? ఏ విషయంలో బెటరండీ అని అంటారా? అయితే మనమంతా బీజేపీకి సైద్ధాంతిక కర్తగా వ్యవహరిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)లో ప్రచారక్ గా కొనసాగిన ఉమేశ్ జీ వద్దకు వెళ్లాల్సిందే. ఎందుకంటే బీజేపీ సీఎంల కంటే జగన్ ఎందుకు బెటరు? ఏ విషయంలో బెటరు? అన్న విషయాలను ఆయనే స్వయంగా వివరించారు. సచిత్ర సాక్ష్యాలతో పాటుగా ఉమేశ్ జీ వెల్లడించిన ఈ విషయాలు వింటే నిజంగానే జగన్ బీజేపీ సీఎంల కంటే కూడా చాలా బెటర్ అని - బెస్ట్ అని కూడా చెప్పొచ్చు.
అయితే జగన్ కు  బీజేపీ సీఎంలకు పోలిక పెడుతూ ఉమేశ్ జీ చేసిన వ్యాఖ్యలు ఏమిటో ఓ సారి పరిశీలిద్దాం పదండి.

ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం తిరుమల తో పాటు రాష్ట్రంలో మిగిలిన అన్ని హిందూ దేవాలయాల్లో హిందూయేతరులను నిషేధిస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటిదాకా ఎప్పుడు ఈ విషయం తెర మీదకు వచ్చినా ఏం చేస్తే  ఏం ముంచుకొస్తుందోనన్న భయంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ సాహసం చేయలేదు. అయితే వైరి వర్గాల నుంచి హిందూ వ్యతిరేకిగా క్రైస్తవుడిగా తీవ్రమైన స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ మాత్రం వచ్చీ రాగానే హిందూ ఆలయాల్లో హిందూయేతర ఉద్యోగుల ప్రవేశాన్ని నిషేదించారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న ఉమేశ్ జీ జగన్ ను నిజంగానే ఆకాశానికెత్తేశారు.

ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో జగన్ ను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఉమేశ్ జీ ఓ అచ్చమైన హిందువుగా శంఖాన్ని ఊదుతున్న జగన్ ఫొటోను దానికి ట్యాగ్ చేశారు. ఈ సందర్భంగా ఉమేశ్ జీ చాలా ఆసక్తికరమైన వాదనను వినిపించారు. హిందూ పరిరక్షకులమని చెప్పుకునే బీజేపీ సీఎంలు చేయలేని పనిని జగన్ ఒక్క దెబ్బతో చేసేశారని ఇందుకు చాలా ధైర్యం కావాలని ఆయన వ్యాఖ్యానించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ఇంతగా దోహదపడే విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకుంటే మీడియా మాత్రం ఆయన చేసిన మంచి పనిని ఆశించిన మేర ప్రచారం చేయలేదని ఉమేశ్ జీ వాపోయారు. జగన్ చేసిన పనినే ఏ బీజేపీ సీఎమ్మో చేసి ఉంటే ఆయనను ఆకాశానికి ఎత్తేసేవారేనని కూడా ఆయన మీడియాపై తనదైన శైలి సెటైర్లు సంధించారు. జగన్ తన ఓటు బ్యాంకును పక్కనపెట్టి మరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పటికైనా బీజేపీకి చెందిన ముఖ్యమంత్రులు తాము కూడా తీసుకోవాలని ఉమేశ్ జీ సూచించారు. మొత్తంగా బీజేపీ సీఎంల కంటే కూడా జగన్ చాలా బెటరంటూ బీజేపీ సైద్ధాంతిక కర్త ఆరెస్సెస్ నేపథ్యమున్న ఉమేశ్ జీ చెప్పడం ఆసక్తికరమే.

For All Tech Queries Please Click Here..!
Topics: