ప్రకాశంలో 10 మంది వాలంటీర్ల రాజీనామా

Friday, April 3, 2020 01:46 PM Politics
ప్రకాశంలో 10 మంది వాలంటీర్ల రాజీనామా

కుల, మత, ప్రాంత, పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో ప్రారంభమైన గ్రామ వాలంటీర్ల వ్యవస్ధకే మచ్చతెచ్చే ఘటన ఒకటి ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేక, అలాగని వారితో అవమానాలు భరించలేక 10 మంది వాలంటీర్లు ఉద్యోగాల నుంచి తప్పుకున్న ఘటన ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయినట్లు సమాచారం.

వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం నాగులవరంలో గ్రామ వాలంటీర్లు కొందరు గ్రామస్దులకు నెలనెలా ఇచ్చే సామాజిక పింఛన్లను ప్రజలకి ఇవ్వలేకపోతున్నారు. అర్హులని తెలిసి కూడా పింఛన్లు నిరాకరిస్తున్నపరిస్ధితి. దీనికి కారణం స్ధానికంగా ఉన్న కొందరు వైసీపీ నేతల జోక్యమే. దీంతో అర్హులైన వారు, ఎన్నో ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న వారికీ తాజాగా నిరాదరణ ఎదురవుతోంది. పింఛన్ల నిరాకరణపై గ్రామస్ధుల నుంచి వాలంటీర్లకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పింఛన్లు అందుకుంటున్న తమ పేర్లను ఇప్పుడెలా తొలగిస్తారంటూ వారు వాలంటీర్లను నిలదీస్తున్నారు. దీంతో అర్హులకు సమాధానం చెప్పలేక, అలాగని అనర్హులకు పింఛన్లు ఇవ్వలేక వాలంటీర్ల పరిస్ధితి దారుణంగా మారింది.

నాగులవరంలో అర్హులైన వారికి పింఛన్లు ఇచ్చేందుకు వాలంటీర్లు చేసిన ప్రయత్నాలు విఫలం కావడం, స్ధానికంగా నివాసం ఉండని గ్రామ పంచాయతీ కార్యదర్శి భర్త వైసీపీ నేత కావడంతో వారికి ఎదురుచెప్పలేక నలిగిపోతున్న వాలంటీర్లు రాజీనామాలే శరణ్యమని భావించి వారు తమ పదవులను రాజీనామా చేశారు.

For All Tech Queries Please Click Here..!
Topics: