వ్యాక్సిన్ తీసుకున్న 3 రోజులకే ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్‌ మృతి

Monday, March 22, 2021 03:15 PM Offbeat
వ్యాక్సిన్ తీసుకున్న 3 రోజులకే  ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్‌ మృతి

Bhubaneswar, Jan 27: కరోనా వ్యాక్సిన్‌పై ఆశలు చిగురిస్తున్న నేపథ్యంలో దానిపై వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్న కొందరు మరణించారనే వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే అవి కరోనా వ్యాక్సిన్ (COVID vaccine) వల్ల కాదని ఇతర కారణాల వల్ల అని వైద్యులు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఒడిశాలో కరోనా టీకా వేసుకున్న ఆస్పత్రి సెక్యూరిటీ గార్డ్‌ (Odisha Healthcare Worker Dies) ప్రాణాలు విడిచాడు. నౌపద జిల్లాలోని దియాన్‌ముందకు చెందిన 27 ఏళ్ల వ్యక్తి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. 

జనవరి 23న అతడు కోవిడ్‌ వ్యాక్సిన్‌ టీకా (Corona Vaccination) తీసుకున్నాడు. ఎప్పటిలాగే విధుల్లోకి వచ్చిన అతడు సోమవారం అనారోగ్యం పాలు కావడంతో అదే ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో అతడిని వీఐఎమ్‌ఎస్‌ఏఆర్‌ ఆస్పత్రికి తరలించగా మంగళవారం తుదిశ్వాస విడిచాడు. అయితే అతడు వ్యాక్సిన్‌ వల్ల చనిపోలేదని నౌపద జిల్లా ప్రధాన వైద్యాధికారి‌ కాళీప్రసాద్‌ బెహెరా పేర్కొన్నారు. బాధితుడు అనీమియా, థ్రాంబోసైటోపేనియా వంటి వ్యాధులతో సతమతమవుతున్నాడని, ఈ క్రమంలో అతడి ప్లేట్‌లెట్స్‌ తగ్గిపోయి, అనారోగ్యంతో మరణించాడని తెలిపారు.

ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఒక యువ డాక్టర్ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కు చెందిన ధనలక్ష్మి ఒంగోలు రిమ్స్ లో డాక్టర్ గా పని చేస్తున్నారు. ఈనెల 23వ తేదీన ఆమె కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ తర్వాత 24వ తేదీ నుండి డాక్టర్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ఆమెకు రిమ్స్ లో చికిత్స అందించారు. అయినప్పటికీ ఆమె కోలుకోలేదు. జ్వరం ఎక్కువ కావడం తో పాటుగా ఒక్కసారిగా బిపి తగ్గిపోయింది. 

మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలోకు తరలింపు దీంతో వెంటనే అప్రమత్తమైన జీహెచ్ వైద్యులు చికిత్స కోసం సంఘమిత్ర ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం డాక్టర్ ధనలక్ష్మిని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా వ్యాక్సినేషన్ కార్యక్రమం మాత్రం కొనసాగుతుంది.

ఇక తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్‌సీ పరిధిలోని దీన్‌దయాళ్‌ నగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్‌ (హెల్త్‌కేర్‌ వర్కర్‌) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటి నుంచి వనిత కొద్దిపాటి అనారోగ్యంగా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు. ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న 45 ఏళ్ల మహిళా ఆరోగ్య కార్యకర్త ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై జిల్లా సైడ్‌ ఎఫెక్ట్స్‌ పర్యవేక్షణ కమిటీ నుంచి రాష్ట్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కమిటీకి నివేదిక పంపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలన అనంతరం ఆ నివేదికను కేంద్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌ కమిటీకి పంపుతామన్నారు.

ఇక ఏపీలోని గుంటూరులో వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్ అయ్యింది. అస్వస్థతకు గురైన ఏఎన్‌ఎం కోలుకుంటోంది. తాడేపల్లి పీహెచ్‌సీ పరిధిలోని ఏఎన్‌ఎం‌గా పనిచేస్తున్న గొట్టిముక్కల లక్ష్మీ (38), ఆశ కార్యకర్త బొక్కా విజయలక్ష్మీ (42)కి జనవరి 20న కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేశారు. టీకా వేసుకున్న తర్వాత ఆరోగ్య కార్యకర్తకు తలనొప్పి, ఫిట్స్‌ రాగా.. విజయలక్ష్మి తలనొప్పి, మగత, వాంతులు వంటి లక్షణాలతో స్పృహ కోల్పోయింది. 

దీంతో వారిద్దరినీ చికిత్స కోసం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో చేర్చించారు. ఆందోళన కారణంగా ఏఎన్‌ఎం లక్ష్మీకి రియాక్షన్‌ వచ్చిందని, చికిత్స తర్వాత ఆమె వెంటనే సాధారణ స్థితికి చేరుకున్నారని జీజీహెచ్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.అయితే, ఆశ కార్యకర్త విజయలక్ష్మీ మాత్రం బ్రెయిన్‌ స్టెమ్‌ స్ట్రోక్‌కు గురైనట్టు నిర్ధారించారు. శనివారం రాత్రి ఆమె బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. ఆమె బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయినట్లు ఆదివారం ఉదయం జీజీహెచ్ వైద్యులు ప్రకటించారు. 

విజయలక్ష్మీ తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. విజయలక్ష్మీకి వేసిన వయల్‌ నుంచే మరో వైద్యుడికి టీకా వేసినా ఆయనకు ఎటువంటి దుష్ప్రభావం తలెత్తలేదు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ చుక్కా రత్నమన్మోహన్‌ జీజీహెచ్‌కు చేరుకుని వారిద్దరి పరిస్థితిపై ఆరా తీశారు.

ఇక నార్వేలో ఫైజర్, బయో ఎన్ వ్యాక్సిన్ తీసుకున్న వృధ్ధుల్లో 23 మంది మరణించగా, మరో 23 మంది తీవ్ర అస్వస్థత పాలయ్యారు. 80 ఏళ్లకు పైబడిన వృధ్ధుల్లో ఈ మరణాలు ఎక్కువగా సంభవించాయని డాక్టర్లు తెలిపారు. ఈ ఉదంతంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వయస్సు మరీ మీద పడినవారు, ఈ టీకామందు తీసుకోకపోవడమే మంచిదని నార్వేజియన్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ పబ్లిక్  హెల్త్ ప్రకటించింది. డాక్టర్లు కూడా ఈ విషయమై ప్రజలను హెచ్చరించాలని సూచించింది.

ఇక కోవిడ్ -19 కు టీకాలు వేసిన తరువాత ప్రతికూల సంఘటనలను పరిశీలిస్తున్న ప్యానెల్, రాజస్థాన్‌లో టీకాలు వేసిన ఐదు రోజుల తరువాత మరణించిన సురేష్ చంద్ర శర్మ మరణంపై దర్యాప్తు జరిపింది. మెదడు రక్తస్రావంకు దారితీయడం,  మూత్రపిండాల వ్యాధి కారణంగా మరణం సంభవించిందని నిర్ధారించారు.

రాజస్థాన్‌లోని చిత్తోర్‌ఘ జిల్లాలో మరణించిన అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్ చంద్ర శర్మ మరణంపై ప్రతికూల సంఘటన తరువాత ఇమ్యునైజేషన్ (ఎఇఎఫ్‌ఐ) కమిటీ దర్యాప్తు చేసింది. తన నివేదికలో, శర్మ అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడని, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న దీర్ఘకాలిక రోగి అని మెదడు రక్తస్రావం అతని మరణానికి దారితీసిందని మరియు అతని మరణానికి కరోనావైరస్ వ్యాక్సిన్ మోతాదుతో సంబంధం లేదని తేల్చిచెప్పారు.

సురేష్ చంద్ర శర్మ జనవరి 21 న రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లాలోని గీతాంజలి మెడికల్ కాలేజీలో కన్నుమూశారు. గత మూడేళ్లుగా గుజరాత్ లోని నాడియాడ్ లో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో చికిత్స పొందుతున్నారు.

ఇక కర్ణాటకలోని శివమొగ్గ నగరంలో కరోనా టీకా వేయించుకున్న ప్రముఖ ప్రైవేటు వైద్యుడు గుండెపోటుతో మరణించడం కలకలం రేపింది. జేపీ ఆస్పత్రి యజమాని, ఓ మెడికల్‌ కాలేజీలో ఆర్ధోపెడిక్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అయిన డాక్టర్‌ జయప్రకాశ్‌ (58) ఈ నెల 17వ తేదీన కోవిషీల్డ్‌ టీకా వేయించుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆయన గుండె పోటుతో మృతిచెందారు. ఈ విషయమై జిల్లా వైద్యారోగ్య అధికారులు మాట్లాడుతూ డాక్టర్‌ జయప్రకాశ్‌ హృద్రోగంతో బాధపడుతున్నారు, కొన్ని సంవత్సరాల కిందట ఆయనకు బైపాస్‌ సర్జరీ జరిగిందని చెప్పారు. ఆయన మరణానికి కారణం కరోనా వ్యాక్సిన్‌ కాదని అన్నారు.

For All Tech Queries Please Click Here..!