మనలాంటి సామాన్యుడే..కాని అసామాన్యుడయ్యాడు

Wednesday, March 17, 2021 02:15 PM Offbeat
మనలాంటి సామాన్యుడే..కాని అసామాన్యుడయ్యాడు

పుట్టినవాడు గిట్టక మానడు..గిట్టిన వాడు పుట్టక మానడు 

ఈ జననం మరణం మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ప్రతి ఒక్కరి జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. 

పుట్టుక చావు మధ్యలో నీవు ఏం చేశావు. నీ జీవితాన్ని ఎలా మలుచుకున్నావు. 

ఇదే నిన్ను భూమి మీద నిలుపుతుంది. నీవు పోయిన తరువాత నీ రాతను రాస్తుంది. చరిత్రలోకి ఎక్కిస్తుంది. 

 మనిషి నేల మీద ఉన్నన్ని రోజులూ కాస్త సేవను చేస్తే.. అది నేలలోకి వెళ్లిన తరువాత ఆ మనిషి పేరును పదికాలాల పాటు బతికిస్తుంది. అయితే అలా సేవ చేసే వాళ్లు ఈ సమాజంలో ఉన్నారా.. ఉంటే ఎక్కడ ఉన్నారు. ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టం కాకపోవచ్చు.

 ఇలాంటి వారు ఎక్కడో లేరు.. మన మధ్యనే...మనలోనే ఉన్నారు.. 

ఈ ఫోటోలో గుర్తుతో వచ్చి గుర్తు తెలియకుండా కాటికి వెళుతున్న దేహాన్ని మోసుకెళ్తున్న వ్యక్తిని చూశారా..ఈయన మనలాంటి వాడే కాని అందరి వాడయ్యాడు.. నిరాదరణకు గురైన వారికి తండ్రి అయ్యాడు.. చివరి దశలో ఆదరణకు నోచుకోక జీవితాన్ని చాలించిన వారికి అంతిమ సంస్కారాలను నిర్వహించే పెద్ద కొడుకుగా మారాడు. ఇంకా చెప్పాలంటే సామాన్యులలో అసామాన్యుడయ్యాడు. 


 
మలిశెట్టి వెంకటరమణ.. 

కడప జిల్లా అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్.. 

సాధారణంగా పోలీస్ అంటే చాలామందికి దడ.. అయితే ఈ పోలీస్ అంటే చాలామందికి స్నేహితుడు...నిరాదరణకు గురైన వారికి ఆప్త బంధువు. అన్నా అంటే చాలు అందర్నీ అక్కున చేర్చుకుంటాడు..వారికి నేనున్నానని భరోసా ఇస్తాడు. తనకు తోచినంత సాయం చేస్తూ వారి కష్టాలను తీరుస్తాడు. 

పోలీసులంటే విధి నిర్వహణే కాదు మానవత్వం సైతం చూపిస్తారని ఈ అసామాన్యుడు నిరూపిస్తున్నాడు. గుర్తుతో వచ్చి గుర్తు తెలియకుండా చనిపోయిన వారికి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఆయన యాభై ఏడేళ్ల జీవితంలో దాదాపు 588 మందికి దహన సంస్కారాలు నిర్వహించారు. 

మరి ఈ సేవ అతని జీవితంలో భాగంగా ఎలా మారింది ? 

తన పోలీస్ వృత్తిలో భాగంగా ఒకసారి 1993లో ఒక చెరువులోంచి జీవితం చాలించిన దేహాన్ని తీసి పంచనామా చేయించారు. ఆ రోజు ఆ పార్థీవ దేహాన్ని తీసుకువెళ్ళేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతొ గ్రామ నౌకరుతొ కలసి దానిని ఆయనే దగ్గరుండి ఖననం చేసాడు. ఆ తరువాత ఒక సాధువుకు అంతిమ సంస్కారం చేసేటప్పుడు స్థానికులు ముందుకు వచ్చారు. ఈ పరిస్థితులకు చలించిన ఆ పోలీస్ తన కర్తవ్యం ఇదేనని గ్రహించాడు. దేవుడే నాకు ఈ అవకాశం కల్పించాడనుకుని ఈ నిస్వార్థ సేవ వైపు అడుగులు వేశారు. ఇలాంటి సేవ చేసేందుకు సాధారణంగా ఎవ్వరూ ముందుకు రారు.. కాని ఈ పోలీస్ దానిని ఇష్టంగా స్వీకరించారు. అలా మొదలైన అతని నిస్వార్థ సేవా ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి నేడు ఈ స్థాయికి చేరుకుంది. 

ఈ భూమి మీదకు ఓ గుర్తుతో వచ్చి నిరాదరణకు గురై.. తన గుర్తు ఏంటో తెలియకుండా భూమిని విడిచిన వారికి పెద్ద దిక్కులా మారుతున్నారు. సొంత ఖర్చులతో వారి ఖర్మకాండలు జరుపుతూ వస్తున్నారు. ప్రమాదాల్లో మరణించిన గుర్తు తెలియని దేహాలెన్నింటికో ఆయన అంతిమ సంస్కారాలు చేశారు.. చేస్తూ వస్తున్నారు. ఈ సేవా కార్యక్రమానికి తన మిత్ర బృందం కూడా తోడవడంతో సుమారు 588కు పైగా గుర్తు తెలియక ఈ నేలను విడిచిన దేహాలకు దహన సంస్కారాలు నిర్వహించారు.

అంతిమ సంస్కారాలు నిర్వహించడమే కాదు...ప్రతి సంవత్సరం కాశీలో గంగానది ఒడ్డున శాస్త్రోక్తంగా  వారందరికీ పిండ ప్రదానం చేస్తున్నారు. బిడ్డలు తమ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు చేసినట్టే వారందరికీ వారణాసిలో పిండ ప్రదానం చేస్తున్నాడు. కర్మకాండలు జరపటం అంటే కీడుకు సంబంధించినదిగా అందరూ భావిస్తారనీ... తనకు మాత్రం వారికి అయినవాడిలా మారటం సంతృప్తినిస్తుందంటారు.

రమణ సేవాభావం కడప జిల్లాలో ఎందరినో కదిలించింది. ప్రస్తుతం సుమారు 40మంది ఆయన వెంట సేవాకార్యక్రమాలను చేసేందుకు వెళ్తుంటారు. రానురాను ఈ కానిస్టేబుల్ పేరు "పరమాత్మ రమణ" గా మారిపోయింది.

 అయినవారి ఆదరణకు నోచుకోక నిరాదరణకు గురైన వారి కోసం పరమాత్మ సేవా ట్రస్టు నడుపుతున్నారు. ఈ పరమాత్మ తపోవనాశ్రమం అందరూ ఉండి నిరాదరణకు గురైన ఎందరినో అక్కున చేర్చుకుంది. అందుకే ఆయన అందరికీ పరమాత్మ రమణగా సుపరిచితులయ్యారు. కడప జిల్లా సిద్ధవటం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ ఆశ్రమం ఉంది. మూడున్నర ఎకరాల స్థలం కలిగిన ఈ ఆశ్రమంలో  ఏపుగా పెరిగిన వృక్షాలూ, పూల మొక్కలూ, పండ్ల చెట్లూ వాటి మధ్యలో ఖజానా బాతులూ, పర్ణశాలలను పోలిన నిర్మాణాలతో కూడిన ఈ ప్రదేశం ఓ గురుకులాన్ని తలపిస్తుంది. 

ఆశ్రమం లోపలికి వెళ్లి చూస్తే అక్కడ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారూ, మతి స్థిమితంలేనివారూ, పూర్తిగా మంచానికే పరిమితమైన వారే కనిపిస్తారు.వారంతా ఒకప్పుడు బాగా బతికి చివరి దశలో కుటుంబాల నుంచి వెలివేయబడిన వారు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పిల్లలను పెంచి పెద్ద చేస్తే..జీవిత చరమాకంలో.వారిని కడుపున పుట్టిన పిల్లలు ఆదరించక వారిని నడిరోడ్డు మీద వదిలేస్తే.. ఈ నిస్వార్థ సేవకుడు వారికి పెద్ద కొడుకుగా మారి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. 

తండ్రి తల్లి ఇచ్చిన ఆస్తిని తీసుకుని వారిని చివరి దశలొ రోడ్డు మీద పడేస్తున్న వారి చెంప చెళ్లు మనిపించేలా అందరికీ మెసేజ్ ఇస్తున్నారు. దీని కోసం తన పూర్వీకుల ఆస్తి నుంచి తనకు అందిన రూ.50లక్షలకు తోడు పైసా పైసా కూడబెట్టి పొదుపు చేసుకున్న రూ.10 లక్షలూ, మిత్రులు అందించిన రూ.20 లక్షలూ కలిపి అనాధల కోసం ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు.ఎక్కడా ఎవరిని సాయం కోరకుండా తనకు వచ్చే ఆదాయంతోనే ఆశ్రమాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. తన పిల్లలు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం ఇవ్వడంతో తనకు వచ్చే జీతం మొత్తాన్ని సమాజ సేవకే ఖర్చు చేస్తున్నాడు ఈ మానవతా మూర్తి.

2011లో ప్రారంభించిన ఈ ఆశ్రమంలో నిర్వాహకులూ, వృద్ధులూ ఉండేందుకు మూడు చిన్న చిన్న భవనాల్ని నిర్మించాడు. వాటికి తోడు వంటశాల, పశువుల కొట్టాం, పర్ణశాల ఉంటాయి. మొక్కల పెంపకానికి వీలుగా అక్కడక్కడా నీటి పంపుల్నీ, పక్షుల కోసం చిన్న నీటి తొట్టెల్నీ ఏర్పాటుచేశారు. ఇక్కడ కాసే ప్రతి కాయా, పండే ప్రతి ఫలమూ, పశువులు ఇచ్చే పాలు ఆశ్రమ వాసులకే అందిస్తారు. అతను వృద్ధులకు అవసరమైన ప్రాథమిక వైద్యాన్ని కూడా అందిస్తుంటాడు. అప్పుడప్పుడూ బయట నుంచి వైద్యులు వచ్చి సేవలు అందిస్తారు. 

ఈ ఆశ్రమం విలువ మార్కెట్లో ఇప్పుడు నాలుగు కోట్ల రూపాయలకు పైగా ఉంది. అయితే కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా.. తన తరువాత ఈ ఆశ్రమం ఎవరి చేతుల్లోకైనా వెళుతుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఆశ్రమ ఆస్తిని "పరమాత్మ తపోవనాశ్రమ ట్రస్టు" పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. భవిష్యత్తులో మనసు మారితే’ అన్న ఆలోచన వచ్చి ఆశ్రమ ఆస్తుల్ని ఎవరూ విక్రయించడానికి వీలులేని విధంగా నిబంధన పెట్టాడు. తన తర్వాత నిర్వహణకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఆశ్రమంలో శ్రీగంధం చెట్లు నాటించాడు. భవిష్యత్తులో వాటిని అమ్మగా పెద్దమొత్తంలో డబ్బు వస్తుందనీ, దానిని బ్యాంకులో పొదుపు చేయగా వచ్చే వడ్డీతో ఆశ్రమ నిర్వహణ జరుగుతుందని అతను విశ్వసిస్తున్నారు. తన పిల్లలు కూడా దీనిని అమ్మేందుకు వీలు లేకుండా కేవలం నిర్వహణ బాధ్యతలను చూసుకునే విధంగా నియమ నిబంధనలు రూపొందించారు. 

సేవ ఒక్కటే కాదు.. రోడ్డు ప్రమాదంలో కాని మరో విధంగా కాని గాయపడిన వారికి రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు..ఇప్పటికీ  దాదాపు 47 సార్లుకు పైగా రక్త దానం చేశారు. ఆయనను ఆదర్శంగా తీసుకున్న చాలామంది రక్తదానం చేస్తూ ఉన్నారు..ఈ నిస్వార్థ సేవకునితో ఓ అయిదు నిమిషాలు మాట్లాడితే చాలు..మనిషి పరమార్థం ఇట్టే తెలిసిపోతుంది. 

వృద్ధాశ్రమాలు అవసరం లేని సమాజం రావాలని ఆ మానవతావాది కోరుకుంటున్నాడు. సమాజంలో నేడు కొడుకులు, కోడళ్ళు, కూతుళ్లు, అల్లుళ్లు మూలంగా ఎవరూ నిరాదరణకు గురి అవకూడదని కోరుకుంటున్నారు. ఈ సంస్థకు అనేక సేవా సంస్థలు, వ్యక్తులు వివిధ రకాలుగా సహాయాలు అందించి, ఆ సంస్థ సేవలలో భాగం పంచుకుంటుంటారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా..సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఈ సేవాతత్పరుడు. 

మొదట్లో ఎంతో ఆవేశంతో ఉన్న ఈ పోలీస్..ఆది శంకరాచార్యుల శివానందల హరి, భగవద్గీత, వివేకానుందుని రచనల ప్రభావంతో సరికొత్త జీవితంలోకి ఎంటరయ్యారు. తనలోని స్వార్థం మాయమై ఆ స్థానంలో సమాజానికి ఉపయోగపడే సాధనం వచ్చి చేరింది. జీవిత చరమాంకంలో ఉన్నవారు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నా వారిని తన తండ్రి తల్లిగా భావించి వారి సేవలో తరిస్తుంటానని గర్వంగా చెబుతుంటారు. తాను చేస్తున్న సేవలే తన కుటుంబానికి.. సేవకు శ్రీరామరక్షగా నిలిచాయని బలంగా నమ్ముతారు ఈ సేవా వాది. 

For All Tech Queries Please Click Here..!