వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారా? అయితే ఇది మీరు తప్పకుండా చేయించుకోండి.

Monday, May 4, 2020 10:39 AM News
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నారా? అయితే ఇది మీరు తప్పకుండా చేయించుకోండి.

కరోనా వైరస్ అన్ని‌ పరిశ్రమల రూపురేఖలను మార్చేసింది. వైరస్‌ విస్తరించకుండా చూసే లక్ష్యంతో చాలా కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానాన్ని ఆచరణలో పెట్టాయి. ఐటీ, మీడియా తదితర చాలా రంగాలు ఈ విదంగానే పనిచేస్తున్నాయి. వైరస్‌ ఇప్పట్లో కనుమరుగు కాకపోవచ్చని, వ్యాక్సిన్‌ వచ్చే వరకు సామాజిక దూరం పాటించాలని నిపుణులు అంటున్నారు. దీంతో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం భవిష్యత్తులోనూ కొనసాగొచ్చని భావిస్తున్నారు. ఈ విధానంలో ఉద్యోగులు తమ వ్యక్తిగత కంప్యూటర్‌ లేదా ల్యాప్‌టాప్‌ సాయంతో ఇంటర్నెట్‌ ద్వారా కార్యాలయ సర్వర్లతో అనుసంధానమై పనిచేస్తున్నారు. దీని వలన తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సైబర్‌ దాడుల రిస్క్‌ ఎక్కువగా పొంచి ఉంటుంది. ఏ కొంచెం అవకాశం ఇచ్చినా సైబర్‌ నేరగాళ్లు కంప్యూటర్లు, సర్వర్లలోకి చొచ్చుకుపోయి నష్టానికి కారణం కావచ్చు. కరోనా వైరస్‌ పేరుతో నిత్యం 2,600 సంస్థలపై సైబర్‌ దాడులు జరుగుతున్నాయని ఇటీవలే పలు‌ సర్వేలు వెల్లడించింది.

ఇటువంటి ప్రమాదకర సైబర్ దాడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలువైన డేటాతోపాటు, బ్యాంకు ఖాతాల్లోని డబ్బును, వాటి సమాచారాన్ని జాగ్రత్తగా కాపాడుకునే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సైబర్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఒక చక్కని పరిష్కారం. సైబర్‌ దాడి జరిగితే ఎదురయ్యే నష్టాన్ని సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ భరిస్తుంది. కనుక ఆన్‌లైన్‌ వేదికగా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వారు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారు, తమ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారాన్ని ఉంచుకునే వారు తప్పకుండా ఈ సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. దాదాపు అన్ని ప్రముఖ బీమా సంస్థలు ఈ తరహా సైబర్‌ కవరేజీలను అందిస్తున్నాయి. 18 ఏళ్లు పైబడిన వారు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో అయితే ఫ్యామిలీ ఫ్లోటర్‌ సైబర్‌ పాలసీని అందిస్తోంది. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటే ప్రీమియంపై 5 శాతం డిస్కౌంట్‌ను కూడా ఆఫర్‌ చేస్తోంది. ప్రతీ ఏటా దీన్ని రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బీమా సంస్థలను బట్టి కవరేజీ ఫీచర్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు. సైబర్‌ దాడి ఏదైనా కానీయండి.. ఏడు రోజుల్లోపు బీమా సంస్థకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మెయిల్‌ లేదా ఫోన్‌ లేదా ఏజెంట్ల ద్వారా సమాచారాన్ని అందించొచ్చు. క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేస్తూ, ఆధారంగా అన్ని రకాల డాక్యుమెంట్లను సమర్పించాలి. ఇవి అందిన రోజు నుంచి 30 రోజుల్లోగా బీమా సంస్థ క్లెయిమ్‌ను పరిష్కరిస్తుంది. క్లెయిమ్‌ ఫామ్, ఎఫ్‌ఐఆర్‌ కాపీ, సైబర్‌ దాడి జరిగినట్టు ఆధారాలు, లీగర్‌ నోటీసులు ఏవైనా అందుకుంటే ఆయా కాపీలను కూడా బీమా సంస్థకు అందించాల్సి ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: