సందట్లో పోలీసుల సడేమియా..!

Saturday, February 15, 2020 02:46 PM News
సందట్లో పోలీసుల సడేమియా..!

రెండక్షరాల ప్రేమ, రెండు క్షణాల ప్రేమ అన్నాడో సినీకవి. ఎందరో ప్రేమికులుఈ పాటలోని మాటలను నిజం చేస్తూ ప్రేమ ఎంత మధురం..ప్రియురాలుఅంత కఠినం అంటూ విరహ గీతాలు పాడుకుంటున్నారు. అయితే కొందరు యువతీ యువకులు మాత్రం ఎన్నెన్నో జన్మల బంధం నీది నాదీ ప్రేమగీతాన్ని ఆలపిస్తూ పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇలా చేదు, తీపి అనుభవాల ప్రేమజంటలు శుక్రవారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సందడి చేశాయి.

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని పర్యాటక, విహార ప్రాంతాలు ప్రేమజంటలతో కళకళలాడాయి. మోటార్‌ సైకిళ్లు, కార్లు బారులుతీరాయి. అంతర్జాతీయ పర్యాటక ప్రాంతమైన మహాబలిపురానికి ఉదయం 8 గంటల నుంచి పెద్ద సంఖ్యలో ప్రేమజంటలు చేరుకోవడం ప్రారంభమైంది. మహాబలిపురం, చెన్నై మెరీనాబీచ్, బిసెంట్‌నగర్‌ బీచ్, ప్రధానమైన పార్కులు ప్రేమజంటలకు నిలయాలుగా మారాయి. బీచ్‌లలో ఎండను సైతం లెక్కచేయకుండా ఇసుకపై గంటలతరబడి కూర్చుని కాలక్షేపం చేశారు. పుష్పాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. 

జేబులు నింపుకున్న పోలీస్‌  
వివిధ వాహనాల్లో ఉత్సాహంగా వెళుతున్న ప్రేమజంటలను తనిఖీల పేరుతో బెదిరించి కొందరు పోలీసులు జేబులు నింపుకున్నారు. ఈసీఆర్‌లో వెళ్లే ప్రేమజంటలను అపి వాహన పత్రాల తనిఖీ, హెల్మెట్‌ వంటి వాటిని సాకుగా పెట్టుకుని జరిమానాలు విధించారు. కొద్దిపాటు డబ్బును తెచ్చుకున్న ప్రేమజంటలు సమీపంలోని దుకాణాల్లో తమ విలువైన వస్తువులను కుదువబెట్టి పోలీసులకు చెల్లించారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: