రేపు భారత్ బంద్ మోడీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకమైన 10 కార్మిక సంఘాలు.

Tuesday, January 7, 2020 10:24 AM News
రేపు భారత్ బంద్ మోడీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏకమైన 10 కార్మిక సంఘాలు.

ప్రధాని నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా 10 కార్మిక సంఘాలు (10 central trade unions) ఏకమయ్యాయి. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో (INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC)లు సంయుక్తంగా జనవరి 8న దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్‌ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాయి.

ప్రభుత్వ "ప్రజా వ్యతిరేక" విధానాలకు నిరసనగా జనవరి 8 న జరిగే దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మందికి తక్కువ కాకుంటా పాల్గొంటారని పది కేంద్ర కార్మిక సంఘాలు తెలిపాయి. జనవరి 2, 2020న తమ డిమాండ్లపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కార్మిక మంత్రిత్వ శాఖ విఫలమైందని సంఘాలు చెబుతున్నాయి. దీంతో కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి హక్కులను రక్షించుకునేందుకు జనవరి 8న (January 8th) అఖిల భారత సమ్మె చేపట్టనున్నామని 10 కేంద్ర కార్మిక సంఘాలు (సిటియు) ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచే ఎజెండాతో 60 మంది విద్యార్థుల సంస్థలు, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయిని వారు తెలిపారు. దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల ఫలితంగా నిజ వేతనాలు పడిపోయాయననీ, అనేక ప్రభుత్వరంగ సంస్థలలో కూడా వేతన సవరణలు పెండింగ్‌లో ఉన్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఎయిరిండియా, బీపీసీఎల్‌ విక్రయానికి ప్రభుత‍్వం నిర్ణయం తీసుకుందనీ ఇది ఉద్యోగులను ఇంటికి సాగనంపే ప్రకియకు ఊతం ఇస్తోందని సంఘాలు మండిపడ్డాయి. అలాగే బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీనం తరువాత 93,600 టెలికాం కార్మికులు ఇప్పటికే విఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) కింద ఉద్యోగాలను కోల్పోయారని విమర్శించాయి. ప్రత్యామ్నాయ విధానాల కోసమే దేశ కార్మికవర్గం ఐక్యంగా పోరాడతామని పేర్కొన్నాయి. దీంతో పాటు, రైల్వేలలో ప్రైవేటీకరణ, 49 రక్షణ ఉత్పత్తి యూనిట్ల కార్పొరేటైజేషన్, ప్రభుత్వ బ్యాంకుల విలీనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

అలాగే జెఎన్‌యూలో చెలరేగిన హింసను కార్మిక సంఘాలు ఖండించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు తమ సంఘీభావం తెలిపారు. 175 మందికి పైగా రైతు, వ్యవసాయ కార్మికుల సంఘాల ఉమ్మడి వేదిక తమ డిమాండ్లతోపాటు ‘గ్రామీణ భారత్ బంద్‌’ పేరుతో ఈ సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలిపాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: