ఎస్ఈసీ నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన ఏపీ హైకోర్టు

Saturday, March 13, 2021 02:00 PM News
ఎస్ఈసీ నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన ఏపీ హైకోర్టు

Amaravati, Jan 13: పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ని నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఎన్నికల కమిషన్‌ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసిన సంగతి విదితమే. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అప్పీల్‌ను తక్షణమే విచారించకపోతే వచ్చే న్యాయ పరమైన ప్రతిబంధకాలు ఏమీ లేవని తేల్చి చెబుతూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

కాగా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ నిమిత్తం జారీ చేసిన షెడ్యూల్‌ను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ గంగారావు.. ఎన్నికల షెడ్యూల్‌ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌ను నిలిపేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ సోమవారం రాత్రి హౌస్‌ మోషన్‌ రూపంలో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అత్యవసర కేసులను విచారిస్తున్న జస్టిస్‌ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ మంగళవారం సాయంత్రం ఆయన ఇంటి వద్ద విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్‌ తరఫున ఎన్‌.అశ్వనీ కుమార్‌ వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. 

ఇద్దరి వాదనలు, హైకోర్టు అభిప్రాయం..
ఎన్నికల కమిషన్‌ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సాధారణంగా న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదు. ఈ అప్పీల్‌పై విచారణ ఒక్క రోజు వాయిదా వేసినా, ఎన్నికల్లో పోటీదారులు, ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతారు. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఆగిపోయింది’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఇవన్నీ ఈ నెల 18న రెగ్యులర్‌ బెంచ్‌ ముందు చెప్పుకోండని స్పష్టం చేసింది. 

2020 మార్చిలోనే ఓటర్ల జాబితాను ప్రచురించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సవరించిన ఓటర్ల జాబితా రావాల్సి ఉంది. ఈ నెల 15న ఆ జాబితా వచ్చే అవకాశం ఉంది. దానిని ఈ నెల 22న ఎన్నికల కమిషన్‌కు అందచేస్తాం. కాబట్టి ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఆగిపోయిందని చెప్పడం సబబు కాదని ఏజీ శ్రీరాం వివరించారు. తాము ఏజీ వాదనలతో ఏకీభవిస్తున్నామని, ఆయన నిజాయితీగా అన్ని విషయాలు చెప్పారని ధర్మాసనం తెలిపింది. ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి జోక్యం చేసుకుంటూ, నిమ్మగడ్డను ఈ వ్యాజ్యంలో వ్యక్తిగత ప్రతివాదిగా చేర్చారని, ఆయన తరఫున తాను హాజరవుతున్నానని తెలుపగా, మీ వాదనలు వినబోమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
 
ఎన్నికల నియమావళి, కొత్త పథకాల గురించి ఏమంటారని ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి ఎన్నికల తేదీని నోటిఫై చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎన్నికల కమిషన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమల్లోకి తేవాలని కూడా సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేంత వరకు ప్రస్తుత అభివృద్ధి కార్యక్రమాలు ఆపడానికి వీల్లేదని, ఒకవేళ కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే ఎన్నికల కమిషన్‌ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొందని తెలిపారు. 

రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, ప్రభుత్వ పథకాల వల్ల ఓటర్లు ఎలా ప్రభావితం అవుతారన్నది తమ మౌలిక ప్రశ్న అని ధర్మాసనం పేర్కొంది. ఆ అవకాశం లేదని, ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకాలేవీ ఉండవని ఏజీ శ్రీరామ్‌ తెలిపారు.  అన్ని విషయాలను పరిశీలిస్తే ఎన్నికల కమిషన్‌ది కేవలం ఆందోళన మాత్రమేనని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ కేసు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పిన విషయాలను ధర్మాసనం ఈ సందర్భంగా తన ఉత్తర్వుల్లో పొందుపరిచింది.

For All Tech Queries Please Click Here..!