మోడీ సర్కారు సంచలన నిర్ణయం, 10 బ్యాంకులు విలీనంతో 4 బ్యాంకులుగా అవతరణ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక శాఖ దేశంలో తొలిసారిగా సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో గాడిలో పెట్టేందుకు పలు మినహాయింపులు ఇచ్చిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్ తాజాగా బ్యాంకింగ్ రంగంలో అతి పెద్ద మెర్జ్ కి తెరలేపారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటుచేసి అతి పెద్ద విలీనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్ణయంతో మొత్తం 27 ప్రభుత్వ బ్యాంకులు ఇప్పుడు కేవలం 12 బ్యాంకులుగా మిగిలాయి.
ఇప్పటికే బ్యాంకుల రీకాపిటలైజేషన్ (నిధులతో ఉద్దీపన) ద్వారా పలు బ్యాంకులు రెపోరేట్ల ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు పలు పీఎస్బీ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా పేర్కొన్నారు. అలాగే 14 ప్రభుత్వ రంగ బ్యాంకులు లాభాల బాటలో పయనిస్తున్నాయని ఆమె తెలిపారు. అలాగే రూ. 250 కోట్ల కంటే ఎక్కువ రుణాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక ఏజెన్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
బ్యాంకుల విలీనం పైనే నిర్మలా సీతారామన్ ప్రకటించిన కీలక నిర్ణయాలను ఓ సారి పరిశీలిస్తే.. ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. - పీఎన్బీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా ఇది అవతరించనుంది. - కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ విలీనం ద్వారా నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. - ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్ విలీనం ద్వారా 7వ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది.