కరోనా తో అమెరికాలో తెలుగు జర్నలిస్టు మృతి
కరోనావైరస్ బారినపడి ప్రముఖ ఇండియన్ అమెరికన్ జర్నలిస్టు కంచిభొట్ల బ్రహ్మానందం మృతి చెందడం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా జర్నలిస్టు బ్రహ్మానందం మరణించడం ఎంతో కలచివేసిందని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. జర్నలిజంలో కంచిభొట్ల చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధాని మోడీ ప్రశంసించారు.
కంచిభొట్ల బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందినవారు. రాష్ట్రంలోనే ఓ ఆంగ్ల పత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన, తర్వాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎస్ఐలోనూ పనిచేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. కాగా, ఆయన పదిరోజుల క్రితం కరోనా బారిపడ్డారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించినట్లు న్యూయార్క్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.