తల్లికి డెలివరీ చేసిన చిన్నారులు.
పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి ప్రసవం చేయకుండా వైద్యులు వెనక్కు పంపారు. గత్యంతరం లేక ఆ తల్లి తన ముగ్గురు కుమార్తెల సహాయంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన బెంగళూరులో గురువారం చోటు చేసుకుంది. రాయచూరుకు చెందిన లక్ష్మీ కుటుంబం ఉపాధి కోసం కొన్నేళ్ల కిందట బెంగళూరుకు వలస వచ్చింది. భర్త, ముగ్గురు కుమార్తెలతో కలసి బ్యాడరహళ్లిలో నివాసం ఉండేది. లక్ష్మీ మరోసారి గర్భం ధరించిన తర్వాత భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు.
దీంతో ఆమె బేల్దారి పనులకు వెళ్లి కుమార్తెలను పోషిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు 9 నెలలు నిండటంతో బుధవారం నొప్పులు అధికమయ్యాయి. దీంతో కుమార్తెలు ఆమెను బెంగళూరులోని కెంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడ కరోనా వైరస్ లక్షణాలతో ఉన్నవారు చికిత్స పొందుతున్నందున ప్రసవం చేయలేమని, వేరే ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు చెప్పారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమె కుమార్తెలతో కలసి ఇంటికి వెళ్లింది. గురువారం నొప్పులు అధికం కావడంతో తల్లి ఇచ్చిన సూచనలతో ముగ్గురు కుమార్తెలు ప్రసవం చేశారు. మగబిడ్డ జన్మించడంతో కుటుంబంలో ఆనందం మిన్నంటింది. విషయం తెలుసుకున్న స్థానికులు వెళ్లి వారికి సహకారం అందజేశారు. అనంతరం విషయాన్ని బ్యాడరహళ్లి పోలీసులకు తెలియజేశారు. వారు అక్కడికి చేరుకొని తల్లి, ముగ్గురు కుమార్తెలు, నవజాత శిశువును ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.