తెలుగు రాష్ట్రాల సరిహద్దులో టెన్షన్.. టెన్షన్.. ఏం జరుగుతోందో తెలుసా?

Monday, March 23, 2020 03:22 PM News
తెలుగు రాష్ట్రాల సరిహద్దులో టెన్షన్.. టెన్షన్.. ఏం జరుగుతోందో తెలుసా?

 తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపేసిన విషయం తెలియకుండా చాల మంది తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణాలు పెట్టుకోవడం ఇప్పుడు రెండు రాష్ట్రాల పోలీసులకు సమస్యలు తెస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. ఏపీ, తెలంగాణ చెక్ పోస్టుల వద్ద వాహనాలను నిలిపేశారు. విషయం తెలియకుండా ప్రయాణాలు పెట్టుకున్న వారు సరిహద్దుల్లో ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రాష్ట్ర సరిహద్దులను దాటనీయకపోవడంతో ప్రయాణీకులు వారితో వాదులాటకు దిగుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు చెబుతున్నా తమ ప్రయాణాలకు తగిన కారణాలు చెబుతూ పోలీసులను అభ్యర్థిస్తున్నారు. ఇరు తెలుగు ప్రభుత్వాలు కఠిన ఆదేశాలు జారీచేయడంతో పలు అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తమ నివాసాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగుతున్నారు ప్రయాణికులు. తగిన కారణాలు చెబుతున్నా.. ప్రభుత్వాల కఠిన ఆదేశాల మేరకు పోలీసులు వారిని తమ రాష్ట్రాలలోకి ఎంటర్ అయ్యేందుకు అనుమతించడం లేదు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారితో పాటు, కర్నూల్ నుంచి వస్తున్న వాహనాలు ఆలంపూర్ చెక్ పోస్ట్ వద్ద, గుంటూరు నుంచి వస్తున్న వాహనాలు మిర్యాలగూడ సమీపంలో నిలిచిపోయాయి. దాంతో ఆయా ప్రాంతాల్లో టెన్షన్ పరిస్థితి నెలకొంది. సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రభుత్వ ఆదేశాల అమలు సవాల్ గా మారింది. ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటే ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టాలి.. అలాగని ప్రభుత్వ ఆదేశాలను కఠినంగా అమలుచేస్తే స్వస్థలాలకు వెళ్లే ప్రజలు రోడ్లపై ఇబ్బందులు పడే పరిస్థితి. సంకట స్థితిలోను పోలీసులు తమ బాధ్యతల నిర్వహణలో తగిన విధంగా ఉంటారని తెలుస్తోంది.

Topics: