పంచాయితీ ఎన్నికలు జరిగితే 3.60 లక్షల మంది ఓటు హక్కును కోల్పోతారు

Friday, March 19, 2021 01:00 PM News
పంచాయితీ ఎన్నికలు జరిగితే  3.60 లక్షల మంది ఓటు హక్కును కోల్పోతారు

Amaravati, Jan 24: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఎన్నికల కమిషన్ ఏపీ సర్కారు మధ్య సమన్వయ లోపం లేకపోయివడంతో పంచాయితీ ఎన్నికలు తీవ్ర చర్చనీయాంశాంగా మారాయి. ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్ పనిలో ఉన్నామని ఎన్నికలు (AP Panchayat Polls 2021) సాధ్యం కాదని చెబుతోంది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ (Nimmagadda Ramesh kumar) మాత్రం ఎన్నికలు జరగాల్సిందే అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నికలపై మళ్లీ హైకోర్టులో (AP High Court) పిటిషన్ వేశారు. 

ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికల నిర్వహణ సరికాదని, హైకోర్టులో గుంటూరుకు చెందిన ధూళిపాళ్ల అఖిల పిటిషన్‌ వేశారు. కొత్త ఓటర్ల జాబితా ప్రకారం 2021 ఓట్ల జాబితా ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా చూడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

2019 జాబితాతో 3.60 లక్షల మంది యువ ఓటర్లకు అన్యాయం జరుగుతోందని, ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు ఉందని పిటిషనర్‌ అంటున్నారు. హౌజ్‌ మోషన్‌ పిటిషన్ దాఖలుకు పిటిషనర్‌ ప్రయత్నం చేశారు. కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున హౌజ్‌మోషన్‌కు హైకోర్టు నిరాకరించింది. సోమవారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది.

కాగా సోమవారం సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారణ జరుగనుంది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనానికి విచారణ మారింది. మొదట జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం జాబితాలో ప్రభుత్వ పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌, జస్టిస్‌ రిషికేశ్‌రాయ్‌ ధర్మాసనానికి పిటిషన్‌ బదిలీ చేశారు. రేపటి విచారణ జాబితాలో ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఎన్నికలపై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్‌ చేసింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ పిటిషన్‌కు ముందే ఎస్‌ఈసీ కేవియట్‌ దాఖలు చేసింది. విచారణలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని ఎస్‌ఈసీ కోరింది.
 
ఇప్పటికే నాలుగు విడతల్లో జరిగే ఈ ఎన్నికలకు గాను.. తొలి దశకు నోటిఫికేషన్‌ జారీచేసింది. మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న  సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ ఎన్నికతో ముగుస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ప్రకటించారు. 

జిల్లాల్లో సోమవారం (ఈ నెల 25న) రిటర్నింగ్‌ అధికారి  (ఆర్వో-కలెక్టర్‌) ఎన్నికల నోటీసు జారీచేస్తారు. అదే రోజు నుంచి అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. 27న నామినేషన్ల దాఖలుకు తుదిగడువు. 28న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన, 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31న నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు, అనంతరం పోటీ ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల, ఫిబ్రవరి 5న పోలింగ్‌. ఈ ఎన్నికల కోసం పోలింగ్‌ గతంలో మాదిరిగా కాకుండా ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటల మధ్య నిర్వహిస్తారు. పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి, దాని తర్వాత ఉపసర్పంచ్‌ ఎన్నికను పూర్తి చేస్తారు.

ఇదిలా ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆదివారం షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 21, 28 తేదీలలో.. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గుజరాత్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.

For All Tech Queries Please Click Here..!