భారీ అగ్ని ప్రమాదం: 43 మంది మృతి...
న్యూఢిల్లీలో ఆదివారం ఉదయం ఆనాజ్ మండిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది మృతి చెందారు. పలువురు మంటల్లో చిక్కుకొన్నారు. మంటల్లో చిక్కుకొన్న వారిని అగ్ని మాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 15 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.క్షతగాత్రులను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పలువురు మృతి చెందినట్టుగా వైద్యులు ప్రకటించారు.
వివరాలలోకి వెళితే ఆదివారం నాడు ఉదయం ఐదున్నర గంటలకు ఈ భవనంలో మంటలు వ్యాపించినట్టుగా అధికారులు చెబుతున్నారు. భవనంలో ఉన్న వారు ఫైరింజన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భవనంలోని ఓ ప్లాట్ లో మంటలు వ్యాపించాయి. ఈ భవనంలో స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్ తయారు చేస్తారని ఆయన తెలిపారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన 15 మందిని ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రికి తరలించినట్టుగా ఆయన తెలిపారు. భవనంలో అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో సుమారు 20 నుండి 25 మంది కార్మికులు భవనంలోనే నిద్రిస్తున్నారని స్కూల్ బ్యాగ్స్, బాటిల్స్ తయారీ కంపెనీ యజమాని తెలిపారు.