విరాట్ కోహ్లీతో డేటింగ్-బ్రేకప్.. స్పందించిన తమన్నా!
టీమ్ ఇండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మను గతేడాది పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లికి ముందు విరాట్ కోహ్లీ మిల్కీ బ్యూటీ తమన్నాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై అప్పట్లో తమన్నా, విరాట్ ఇద్దరూ స్పందించలేదు. అంతలోనే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయినట్లు కథనాలు వచ్చేశాయి. తాజాగా ఫేమస్లీ ఫిలింఫేర్ అనే కార్యక్రమంలో పాల్గొన్న తమన్నా ఈ వ్యవహారంపై తొలిసారి స్పందించింది.
తాను విరాట్ కోహ్లీతో యాడ్ షూటింగ్ లో నటిస్తున్నప్పుడు కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడలేదని తమన్నా చెప్పింది. ‘2012లో ఓ యాడ్ కోసం మేమిద్దరం పనిచేశాం. ఆ తర్వాత విరాట్ ను నేను కలవలేదు. కనీసం మాట్లాడలేదు. కానీ నేను పనిచేసిన హీరోలతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎన్నో రెట్లు నయం’ అని కితాబిచ్చింది. ఇక తాను అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలను సైతం తమన్నా ఖండించింది.