SYE RAA REVIEW : మనసులు గెలిచిన సైరా నరసింహారెడ్డి 

Saturday, October 19, 2019 04:30 PM Entertainment
SYE RAA REVIEW : మనసులు గెలిచిన సైరా నరసింహారెడ్డి 

మనం ఈనాడు స్వేచ్చగా ఊపిరి పీలుస్తున్నామంటే అది ఎందరో త్యాగధనుల త్యాగ ఫలం.  బ్రిటీష్ వారి పాలన నుంచి దేశానికి విముక్తిని ప్రసాదించి చరిత్ర పుటల్లో లిఖించదగ్గ స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాలు మనం చూడకపోయినా, వాటిని పుస్తకాల్లో చదివి పోరాటం అలా జరిగింది, యుద్ధం ఇలా జరిగిందని ఊహించుకుని గర్వపడతాం. ఈ పాయింట్ ని క్యాచ్ చేసుకుని ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. అప్పుడు జరిగిన పోరాటాలను కళ్లకు కట్టినట్లుగా సినిమాల్లో చూపాయి. అయితే ఒక ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని దేశానికి సంబధించిన పోరాటంగా చూపించడమనేది చాలా తక్కువ సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి సినిమాల్లో ముందు వరసలో నిలుస్తుంది సైరా నరసింహారెడ్డి సినిమాల్లోకెళితే..

పవన్ కళ్యాణ్ జరిగిన చరిత్ర గురించి తన వాయిస్ తో సినిమాని ప్రారంభిస్తాడు. ఆ తర్వాత యుద్ధంలో తెల్లదొరలు మనసైన్యాన్ని చంపేయగా ఓ వంద మంది సైన్యం మిగిలుంటారు. ఆ వందమంది యుద్ధం చేయడం ఇక మన వల్ల కాదని లొంగిపోదామని మాట్లాడుకుంటుండగా ఝాన్సీ లక్ష్మీభాయి ( అనుష్క) కత్తితో దూసుకువస్తుంది. ఆ వందమంది సైన్యంతో... మనం తక్కువ మంది ఉన్నామని భయపడుతున్నారా అని వారి వైపు కోపంగా  చూస్తూ..  చరిత్రలో ఓ మహా వీరుడు ఒక్కడే బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడని చెబుతూ సినిమాని స్టార్ట్ చేస్తుంది. ఆ మహా వీరుడే సైరా నరసిహంరెడ్డి.. ఆయన పుట్టుకే మరణం లేని పుట్టుక అంటూ సైరా గొప్పదనాన్ని వివరించే ప్రయత్నంతో సినిమా ముందుకు సాగుతుంది. అయితే ఇక్కడ కొంచెం సినిమా బోరుగా అనిపించేలా అనిపిస్తుంది. సైరా పెరిగి పెద్దవాడవడం లవ్ లో పడటం, చిన్నప్పుడే పెళ్లి అయిందని అమితాబ్ చెప్పడం లాంటి సన్నివేశాలు కొంచెం ప్రేక్షకులకు బోర్ గా అనిపిస్తాయనే చెప్పాలి. ఎందుకంటే ఓ పోరాట యోధుడి సినిమాని చూస్తున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా రుచించవు. ఫస్ట్ లోనే లవ్ ట్రాకా అనే ఆలోచనను కలిగిస్తాయి. అయితే ఇక్కడ తమన్నా అలాంటి ఫీల్ కలగకుండా  తన నటనతో అలరించిందనే చెప్పుకోవాలి. దేవుడి కోసం నాట్యం చేస్తున్నానని సైరాతో తమన్నా చెప్పడం, దేవుడి కూడా ప్రజల కోసమే కాబట్టి నీవు కూడా ప్రజల కోసం నీ నాట్య సందేశాలను అందించమని చెప్పే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. 

తర్వాత బ్రిటిష్ వారికి సామంతులుగా మనం ఉన్నామని తెలిసిన సైరా వారిని ఎదిరించేందుకు 61 సామంత రాజుల ( పాలెగాండ్ల) ను ఏకం చేసే దిశగా సినిమా సాగుతుంది. అయితే అతని ప్రయత్నానికి సామంత రాజులు అడ్డు చెప్పడం పిరికివారిగా మారడం వంటి సన్నివేశాలతో కథనం కొంచెం ఊపందుకుంటుంది. అందర్నీ ఏకం చేసే సమయంలో సైరా జాతర ఏర్పాటు చేస్తాడు. మరో సామంత రాజు (సుదీప్) దాన్ని ఆపేందుకు కుట్ర పన్నుతాడు. ఇక్కడ జరిగే ఎద్దులతో జరిగే ఫైట్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. చూపు తిప్పుకోనీయదు. ఇక్కడ నుంచే బ్రిటీష్ వారి నుండి తమ ప్రాంతాన్ని కాపాడుకోవడమనే కాన్సెప్ట్ తో కథనం సాగుతుంది. పంచ్ డైలాగ్ లు అక్కడక్కడ బాగా ఆకట్టుకుంటాయి. భూమికి శిస్తు కట్టలేని రైతుల భూములను ఆక్రమించుకుంటున్న తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో సైరా తెల్ల దొర తలను నరికేయడంతో ఇంటర్వెల్ అవుతుంది. ఈ సీన్ లో  గుర్రంతో నీవు ఎంత దూరం పరిగెత్తితే అంత దూరం భూమి నీదేనని తెల్లదొర చెప్పడం సుబ్బయ్య అనే రైతు భూమిని కాపాడుకునేందుకు గుర్రంతో పరిగెత్తలేక పడిపోవడం వంటి సీన్లు గుండెల్ని పిండేస్తాయి. ఈ విషయం తెలిసి సైరా అక్కడికి రావడం తెల్లదొరను తరిమి తరిమి కొడుతూ అతని తలను నరికేయడం వంటి సీన్లు ఎక్కడికో తీసుకువెళతాయి. తెల్లదొర తలను నరికే సీన్ నీటిలోపల తీయడమనే కాన్సెప్ట్ నిజంగా అద్భుతమనే చెప్పాలి. 

ఇంటర్వెల్ తరువాత సినిమా నుంచి ప్రేక్షకుని తల తిప్పుకోనీయదు. మాతృభూమి స్వేచ్ఛ కోసం , స్వాతంత్ర్యం కోసం జరిగిన యుధ్దం కళ్ల ముందు చూసినట్లే కనిపిస్తుంది. ప్రతి సీన్ ఆనాటి యుద్ధాలను తలపించే విధంగా దర్శకుడు తీర్చి దిద్దాడు. తెల్లదొరలను ఎదిరించడానికి సైరా తన రాజ్యాన్ని వదిలి 61 మంది సామంత రాజులతో ప్రజల మధ్యకు వెళ్లడం అక్కడ నుంచి పోరాటం చేయడంతో సెకండాఫ్  కథను దర్శకుడు లాగిస్తాడు. ఈ పోరాటంలోనే సైరా భార్య (నయనతార) భర్తను ఉద్యమంలో స్వేచ్ఛగా పోరాటం చేయాలని అతని దగ్గర నుంచి దూరంగా సొంత కోటకు వెళుతుంది. ఇది సైరా ఆమెను కోరిక కోరిన తరువాత జరిగే సీన్. ఇక్కడ తమన్నా సైరా పోరాటాన్ని తన పాటల ద్వారా నలు దిశలా వ్యాపింపజేయడం లాంటి సన్నివేశాలు చాలా బాగా అనిపిస్తాయి. తెల్ల దొరల చేతికి తమన్నా చిక్కడం అక్కడ తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుని 300 మంది తెల్లవారిని చంపేయడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. 

సైరా అన్న మల్లారెడ్డి బ్రిటీష్ వారికి సైరా గురించి క్లూ అందించడం ఆయన్ని శిక్షించడమేనది అతని తల్లికే వదిలేయడం వంటి సీన్లు ఎమోషన్ ని తలపిస్తాయి. పండిన పంట మీకు కావాలంటూ పెళ్లయిన యువతులు మొదటి రాత్రి మాతో గడపాలని తెల్ల దొరలు చెప్పడం ఆనాటి పాలన అరాచకత్వం  కళ్లముందు కనిపిస్తుంది. మాతో పడుకుంటే తెల్ల పిల్లలు వస్తారని చెప్పడమనే సీన్ కూడా తెల్లదొరల రాక్షసత్వాన్నికళ్లకు కట్టినట్లు చూపారు. ఈ సీన్లు గుండెల్ని పిండేస్తాయి. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సైరాను అప్పగిస్తే భారీ నజరానాను అందిస్తామని తెల్లదొరల ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక్కడే తమిళ హీరో రవి ప్రవేశం కనిపిస్తుంది. సైరాను వెతుక్కుంటూ రావడం  మీ పోరాటం దేశ వ్యాప్తంగా మారుమోగుతుందంటూ అతనితో కలిసి పోరాటం చేయడం లాంటి సన్నివేశాల్లో బాగా కనెక్ట్ అయ్యాడు. పోరాటం ముందుకు సాగుతున్న సమయంలో సైరాను, ఫ్యామిలీని చంపేందుకు సామంత రాజులు కొందరు కుట్ర పన్నుతారు. అది తెలుసుకుని దాన్ని సైరా చేధిస్తాడు.  ఇక్కడ బసిరెడ్డి ( జగపతిబాబు) కొడుకుని క్షమించి వదిలేస్తాడు సైరా. అది బసిరెడ్డికి తెలియదు. దాంతో సైరా మీద పగ పెంచుకుంటాడు. అయితే దీన్ని అదనుగా తీసుకుని తెల్ల దొరలు బసిరెడ్డికి లేనిపోనివి చెప్పి సైరాను బందీగా పట్టుకునేందుకు అతని సహాయం కోరతారు.

ప్రతి ఏటా  రేనాట ఉన్న కొండమీద కార్తీక దీపం సైరా నరసింహరెడ్డి వెలిగించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇక్కడ సైరాను పట్టుకునేందుకు పథకం వేస్తారు. అంతకుముందే సైరా చచ్చిపోయాడనే విషయాన్ని తెల్లదొరలు ప్రచారం చేస్తారు. అయితే ప్రజలు ఆ కొండ మీద ఉన్న దీపం వెలిగించడానికి సైరా వస్తాడని ఎదురుచూస్తుంటారు. ఆ రోజు రానే వస్తుంది. సైరా దీపం వెలిగించడానికి వస్తున్న సమయంలో జగపతిబాబు సైరాకు ప్రసాదంలో మత్తుమందు  కలిపి ఇవ్వడంతో సైరా శక్తి సన్నగిల్లుతుంది. దీపం వెలిగించిన తరువాత తెల్లదొరలు సైరాను బందీగా పట్టుకుంటారు. ఇక్కడ కొడుకుని చూసిన బసిరెడ్డి తన తప్పు తెలుసుకుని ముఖం చూపించలేక కత్తితో పొడుచుకుని చనిపోతాడు. 

సైరాను బందీగా పట్టుకున్న తరువాత బ్రిటీష్ కోర్టు సైరా చేసిన తప్పులను ఒప్పుకోమంటోంది. సైరా ఒప్పుకోకపోవడంతో మరణ శిక్ష విధిస్తుంది. చివరి కోరిక ఏంటని సైరాని అడిగితే మీరు మా దేశం నుండి వెళ్లిపోవడమేనని చెప్పడం హైలెట్ సీన్ గా చెప్పవచ్చు. ఆ తర్వాత అతనని ఉరి తీసే సమయంలో సైరా తెల్లదొరను నరికేయడం. ఇలా నరికివేసే సమయంలో సైరా తల నరేకయడంతో సైరా కథ ముగుస్తుంది. ఈ కధను చెప్పిన ఝాన్సీ లక్షీ భాయి ( అనుష్క) వారిలో పోరాట స్పూర్తిని రగిలించడం చివరగా మళ్లీ పవన్ వాయిస్ తో సినిమా ముగుస్తుంది.

మనవాయిస్ ఓపినియన్: సినిమాని సినిమాగా చూస్తే చరిత్రలో నిలిచిపోయే సినిమా 


 

For All Tech Queries Please Click Here..!