పెళ్లైన వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నా.. కానీ అతను నాకు నరకం చూపించాడు
దక్షిణాదిలో నటిగా, గాయనిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఆండ్రియా. గత ఏడాది ఆమె నటించిన ‘విశ్వరూపం 2’, ‘వాడా చెన్నై’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ చిత్రాల్లో ఆండ్రియా నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే దీని తర్వాత ఆమె కోలీవుడ్‌లో కొన్ని నెలలపాటు కనపడలేదు. ఇటీవల ‘బ్రోకెన్ వింగ్’ అనే పుస్తకాన్ని రాసినట్లు నటి స్వయంగా చెప్పారు. ఈ పుస్తకంలో ఆమె ప్రేమపై తన అభిప్రాయాల్ని వర్ణించారు, తన బాధను వ్యక్తం చేశారు. అయితే ఇంత బాధ వెనుక కారణం ఏంటని మీడియా ఆమెను ఓ కార్యక్రమంలో ప్రశ్నించింది.
దీనికి ఆండ్రియా స్పందిస్తూ.. ‘పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీన్ని భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. తిరిగి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా. ఈ బాధలోనే ‘బ్రోకెన్ వింగ్’ పుస్తకాన్ని రాశా. ఈ సమస్యల నుంచి బయటపడేందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నా’ అని చెప్పారు. ఆండ్రియా రెండు రోజుల క్రితం ‘బ్రోకెన్ వింగ్’ పుస్తకం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. పద్యాల రూపంలో వ్యక్తిగత విషయాలు, భావాలను అందరితో పంచుకోవడానికి ధైర్యం కావాలని అన్నారు. అభిమానుల కోసం ‘బ్రోకెన్ వింగ్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ పేజీని కూడా ప్రారంభించానని పోస్ట్ చేశారు. ఈ ఖాతా ద్వారా ఆమె పుస్తకంలోని పద్యాలను షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆండ్రియా చేతిలో తమిళ చిత్రాలు ‘కా’, ‘వట్టం’, ‘మాలింగై’ ఉన్నాయి.