చంద్రముఖీ సీక్వెల్ మళ్లీ వస్తోంది, హీరో ఎవరనేది సస్పెన్స్
చంద్రముఖి కేవలం తమిళనాట మాత్రమే కాకుండా విడుదలైన ప్రతిభాషలోనూ విజయఢంకా మోగించింది. తమిళనాట 175 రోజులపాటు నిరంతరాయంగా ఆడి సరికొత్త రికార్డును తన పేరిట రాసుకుంది. చెన్నైలోని శాంతి థియేటర్‌లో 890 రోజులపాటు నిరంతరాయంగా ఆడి అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఇక రజనీకాంత్ చెప్పే ‘లకలకలకలక..’ డైలాగ్ ఇప్పటికీ చాలామంద నోట్లో నానుతూనే ఉంది. ఈ సినిమాలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు, నజీర్, వడివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. 2005లో విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెక్కు చెదరకుండా నిలిచింది.
గత కొంత కాలంగా చంద్రముఖి 2 రానుందన్న వార్తలు సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ దర్శకుడు పి.వాసు మాటలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. చంద్రముఖి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన పి.వాసు దానికి సీక్వెల్ తీస్తున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్ర్కిప్ట్ దాదాపుగా సిద్ధమైనట్టేనని పేర్కొన్నాడు. ఈ సినిమాకోసం ప్రముఖ నిర్మాణ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సీక్వెల్‌లో రజనీకాంత్ కనిపిస్తారా, లేదా అన్న విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారు.