ఒకే రోజు తల్లితో పాటు ఐదుగురు కుమార్తెల బలవన్మరణం..
తమిళనాడులో ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఆరుగురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. మద్యానికి బానిసైన భర్తతో వేగలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది, తన ముగ్గురు కుమార్తెలను కాలువలో తోసి తనూ దూకేసింది. ఆర్థిక ఇబ్బందులతో మరో ఇల్లాలు తీవ్ర మనోవేదనకు లోనయ్యి తన ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి తనూ సేవించింది. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్తున్నారు. ఈ విషాద ఘటనలు తమిళనాడు వ్యాప్తంగా సంచలనమయ్యాయి.
వివరాలలోకి వెళితే మద్యానికి బానిసైన భర్తతో విసిగిపోయిన ఒక ఇల్లాలు ముగ్గురు కుమార్తెలతో కలిసి కాలువలోకి దూకేసింది. కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన మణికంఠన్ (38), సత్యవతి (29) దంపతులకు ఆంజియ (6), నందిని (4), దర్షిణి (2) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో అక్షయ, నందిని సమీపంలోని ప్రయివేటు పాఠశాలలో చదువుతున్నారు. మణికంఠన్‌మద్యానికి బానిసకావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు చోటుచేసుకునేవి. సత్యవతి ముగ్గురు కుమార్తెలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. సత్యవతికి ఆమె తల్లి నచ్చజెప్పి బుధవారం ఉదయం బస్సు ఎక్కించి భర్త వద్దకు పంపించింది. అయితే భర్త వద్దకు వెళ్లడం ఇష్టంలేని సత్యవతి మార్గమధ్యంలోనే పిల్లలతో కలిసి దిగింది. సాయంత్రం ఆరుగంటల సమయంలో సమీపంలోని పంటకాలువలోకి ముగ్గురు కుమార్తెలతో కలిసి దూకేసింది. స్పృహలేని స్థితిలో సత్యవతి ఒడ్డుకు కొట్టుకురాగా అక్షయ, నందిని ప్రాణాలు కోల్పోయారు. గల్లంతమైన దర్షిణి కోసం గాలిస్తున్నారు.
తేనీ జిల్లా బోడినాయగంకు చెందిన వ్యాపారి పాల్‌పాండి, లక్ష్మి (36) దంపతులకు ప్లస్‌టూ చదువుతున్న అనసూయ (18), 9వ తరగతి చదువుతున్న ఐశ్వర్య (16), 5వ తరగతి చదువుతున్న అక్షయ (10) అనే ముగ్గురు కుమార్తెలున్నారు. అనారోగ్యకారణాలతో పాల్‌పాండి రెండేళ్ల క్రితం మరణించాడు. కుట్టుమిషన్‌పెట్టుకుని అరకొర సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అనసూయను ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముట్టాయి. దీంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైన అనసూయ గురువారం ఉదయం 7 గంటల సమయంలో కాఫీలో విషం కలిపి ముగ్గురు కుమార్తెలకు ఇచ్చి తాను తాగేసింది.