RBI in Twitter: ట్విట్టర్ లో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఆర్‌బీఐ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI ట్విట్టర్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ట్విటర్‌లో ఆర్‌బీఐ ఫాలోవర్లు 10 లక్షలు దాటారు. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులన్నింటిలో పది లక్షలకు మించిన ట్విటర్ ఫాలోవర్లున్నది ఒక్క ఆర్‌బీఐకే. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన సెంట్రల్ బ్యాంకులైన యూఎస్ ఫెడరల్ రిజర్వ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) కంటే ఆర్‌బీఐని అధిక మంది అనుసరిస్తుండటం విశేషం.
అగ్రరాజ్యాల సెంట్రల్ బ్యాంక్‌లతో పోలిస్తే ఆర్‌బీఐ చాలా ఆలస్యంగా ట్విటర్ ఖాతా తెరించింది. యూ ఎస్ ఫెడ్ రిజర్వ్ 2009 మార్చిలో, ఈసీబీ 2009 అక్టోబరులో ట్విటర్ అకౌంట్ ప్రారంభించాయి. కాగా, రిజర్వ్ బ్యాంక్ 2012 జనవరిలో ఖాతా తెరించింది. ఆదివారం నాటికి ఆర్‌బీఐ ట్విటర్ హ్యాండిల్ ఎట్‌ఆర్‌బీఐకి ఉన్న ఫాలోవర్ల సంఖ్య 10,00,513కు పెరిగింది.
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా తన సహోద్యోగులకు అభినందనలు తెలిపారు. 2018 డిసెంబరులో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్ విడిగా నిర్వహిస్తున్న ట్విటర్ హ్యాండిల్‌కు సైతం 1.35 లక్షల ఫాలోవర్లున్నారు.