ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఓలా ప్రణాళికలు

Friday, December 18, 2020 12:15 PM Business
ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ఓలా ప్రణాళికలు

దేశంలోనే అతిపెద్ద ఈ-స్కూటర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి ఓలా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులను ఆ సంస్థ ముమ్మరం చేసినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఒక సంవత్సరంలో సుమారు రెండు మిలియన్ యూనిట్లను తయారు చేసేలా ప్లాంట్ ఉండనుందని సమాచారం. ఇందుకు కనీసం 100 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఈ అత్యాధునిక తయారీ కేంద్రంలో సౌరశక్తిని ఉపయోగించుకోవాలని ఓలా భావిస్తుంది.

ఇతర సంస్థలకు పోటీ
 ఈ వార్తలను ఓలా సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ ఓలా ఎలక్ట్రిక్ రాబోయే 18 నుంచి 24 నెలల్లో ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఆ సంస్థ అనుకున్నట్లుగానే తయారీ కేంద్రాన్ని నెలకొల్పితే.. మన దేశంలో ఇప్పటికే ఈ స్కూటర్లను తయారు చేస్తున్న బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్- బ్యాక్డ్ అథర్ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్ వంటి సంస్థలు కూడా ఉత్పత్తిని పెంచే యోచనలో ఉన్నాయి. ఈ సంస్థలకు ఓలా గట్టి పోటీదారుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.

ఆగస్టు నుంచే ప్రణాళికలు
 అమ్స్టర్‌డామ్‌కు చెందిన ఎటర్గో బివి సంస్థను ఈ ఏడాది మేలో ఓలా ఎలక్ట్రిక్  కొనుగోలు చేసింది. కానీ ఎంత మొత్తానికి ఒప్పందం జరిగిందో వెల్లడించలేదు. ఈ సంవత్సరంలో కొత్తగా 1,000 మంది ఇంజనీర్లను నియమించుకుంటామని ఓలా ఎలక్ట్రిక్  ఆగస్టులో ప్రకటించింది. మన దేశంలో త్వరలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. ఇందుకు టైగర్ గ్లోబల్, మ్యాట్రిక్స్ ఇండియా, టాటా సన్స్ వంటి సంస్థల నుంచి  ఓలా ఎలక్ట్రిక్ సుమారు 400 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది.


 


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!