విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఆటోమేటిక్: ధర ఎంతో తెలుసా?

భారతదేశపు ప్రముఖ ఎస్యూవీ వాహనాల తయారీ సంస్థగా పేరుగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా విపణిలోకి మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్యూవీ యొక్క ఆటోమేటిక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఎక్స్‌యూవీ300 కాంపాక్ట్ ఎస్‌యూవీకి కొనసాగింపుగా ఆటోమేటిక్ వేరియంట్‌ను తీసుకొచ్చారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 డీజల్ లభించే W8 మరియు W8(O) టాప్ ఎండ్ వేరియంట్లలో మాత్రమే ఈ ఏఎమ్‌టి వేరియంట్లను లాంచ్ చేశారు. వీటి ధరలు వరుసగా రూ. 11.50 లక్షలు మరియు రూ. 12.70 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. బుక్ చేసుకునే కస్టమర్లకు వెంటనే డెలివరీ కూడా ఇవ్వనున్నారు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఎస్యూవీ సాంకేతికంగా 1.5-లీటర్ డీజల్ మరియు 1.2-లీటర్ టుర్భో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. కానీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ డీజల్ ఇంజన్లో మాత్రమే లభిస్తోంది. రెండింటినీ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడా ఎంచుకోవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఏఎమ్‌టి ఎస్యూవీ ప్రస్తుతం విపణిలో ఉన్న హ్యుందాయ్ వెన్యూ, ఫోర్డ్ ఇకోస్పోర్ట్, టాటా నెక్సాన్ మరియు మారుతి సుజుకి వితారా బ్రిజా వంటి ఇతర కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోటీపడనుంది.